తెలుగుదేశం, జనసేన పార్టీతో టీడీపీ సీనియర్ నేతలు ఎక్కువగా నష్టపోనున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఒక చర్చ అయితే ఎక్కడ ఇస్తారు అన్నది మరో చర్చ. జనసేన బలం బలగం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఉన్నాయి. దీంతో ఇక్కడ సీట్లను ఆశిస్తున్న తమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది.
ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలకు కష్టమే
విశాఖ జిల్లాలో భీమిలి , విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాలను జనసేన కోరే అవకాశం ఉంది. ఇందులో ఒకటి రెండు తగ్గినా కచ్చితంగా అయిదు సీట్లకు తక్కువ కాకుండా జనసేన డిమాండ్ చేస్తుంది అంటున్నారు. గాజువాకలో అయితే టీడీపీ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భీమిలీ కోరుతున్నారు.
సీనియర్ నేతలు సర్దుకోవాల్సిందే !
పెందుర్తి నుంచి మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఈసారికి సర్దుకోవాల్సిందే అంటున్నారు. నిన్నటి కధ వేరు ఇపుడు వేరు, చంద్రబాబు కష్టాలలో ఉన్న వేళ పవన్ అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చిన నేపధ్యంలో ఆయన కోరిన సీట్లు ఇవ్వడం తప్ప మరో మార్గం టీడీపీకి లేదు అంటున్నారు. దాంతో సీనియర్ నేతలు అయినా జాగా ఇచ్చి తప్పుకోవాల్సిందే అంటున్నారు. అలాగే అనకాపల్లిలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కూడా టికెట్ ఆశలు వదులుకోవాల్సిందే. చోడవరం కధ కూడా అంతే అంటున్నారు.
సర్దుకుంటే పర్వాలేదు.. లేకపోతే
విజయనగరం జిల్లా తీసుకుంటే గజపతినగరం, ఎస్ కోట, నెల్లిమర్ల సీట్లను జనసేన కోరుతోంది. దాంతో ఇక్కడ తమ్ముళ్ళకు నిరాశే అంటున్నారు. శ్రీకాకుళంలో పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల సీట్లు జనసేనకు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఎచ్చెర్లలో మాజీ మంత్రి కళా వెంకటరావు ఇక ఆశలు వదిలేసి జనసేనకు మద్దతు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటు మరింత క్లిష్టంగా మారనుంది.