భూమా ఫ్యామిలీలో వారసులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. చంద్రబాబుతో మంచు మనోజ్ – భూమా మౌనికారెడ్డి భేటీ తర్వాత ఆ కుటుంబంలో రచ్చ రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో భేటీ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు మనోజ్ ప్రకటించడంతో ఇది మరింత చర్చకు దారితీసింది. భూమా మౌనికా రెడ్డి అరంగేట్రం పక్కా అని.. నంద్యాల నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ నంద్యాల సీటు కోసం బ్రహ్మానందరెడ్డితో పాటు కొత్తగా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా రేసులోకి వచ్చారు.
నంద్యాల నుంచి పోటీకి సిద్ధమన్న భూమా కుమారుడు
ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ , నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిక్కెట్ల రేసులో ఉన్నారు. ఇప్పుడు భూమా మౌనిక కోసం చంద్రబాబును కలిశారు. మౌనిక కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తుండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీచేస్తారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో ఈ భేటీపై మౌనికారెడ్డి సోదరుడు, టీడీపీ యువనాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా తాను టిక్కెట్ ఆశిస్తున్నారని చెబుతున్నారు. భూమా శోభానాగిరెడ్డి, నాగిరెడ్డి చనిపోయినప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి మైనర్. ఇప్పుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే బరిలోకి దిగాల్సిందేనని నంద్యాలలో విస్తృత్యంగా పర్యటిస్తున్నారు.
నంద్యాలలో సీటు కోసం భూమా కుటుంబంలో ముగ్గురు పోటీ
మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో ఇప్పటికే సీటు ఆశిస్తున్నారు . జగత్ విఖ్యాత్ రెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలతో వరుస సమావేశాలవుతున్నారు. ఇక్కడ్నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని స్వయంగా జగత్ ప్రకటించారు కూడా. నంద్యాల ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నేను ఉన్నాను. నంద్యాల టికెట్ కోసం టీడీపీలోనే కాదు.. వైసీపీలో కూడా టికెట్ కోసం పోటీ ఉంది అంటున్నారు. కానీ తమ కుటుంబంలోనే పోటీ ఉందనే సంగతిని విఖ్యాత్ రెడ్డి గుర్తించలేకపోతున్నారు. నంద్యాల నుంచి విఖ్యాత్ పోటీచేస్తారని.. బ్రహ్మానందరెడ్డిని పక్కనెట్టేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు.
ఎవరో ఒకరు రెబల్ కాక తప్పదా ?
భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ అధిష్టానం చెప్పింది. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుంచే నేను పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తాను. నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను. నేను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎవరికి సత్తా ఉంటుందో.. ఎవరు కార్యకర్తలకు భరోసా ఇస్తారో వారికే టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని అంటున్నారు. బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాల నియోజకవర్గంలో మునుపటిలా యాక్టివ్‌గా లేరు. దీంతో విఖ్యాత్ రంగంలోకి దిగిపోయారు. మరో ఇద్దరు కూడా టికెట్ గట్టి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చివరికి ఒకరు రెబల్ అవుతున్నారన్న అభిప్రయం మాత్రం వినిపిస్తోంది.