మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా వైసిపిలో చేరారు. బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి నందిగం సురేష్‌ను కాకుండా రావెల సతీమణి శాంతిజ్యోతిని అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారని .. అందుకే ఆమెను కూడా పిలిచి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు.
రావెల చేరిన ఐదో పార్టీ వైసీపీ
గతంలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేసిన ఆయన.. తర్వాత టీడీపీకి దూరమయ్యారు. టిక్కెట్ కూడా ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. మళ్లీ బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఏ ముహుర్తాన చేరాలో కానీ.. కేసీఆర్ అనేక సమస్యల్లో పడ్డారు. చివరికి ఆయన ఇతర రాష్ట్రాల్లో పార్టీని పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పుడు వైసీపీ పిలిచి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధపడటంతో ఆయన ఆఘమేఘాలపై పార్టీలో చేరిపోయారు.
నర్సరావుపేట లోక్ సభకు అనిల్ కుమార్
నర్సరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ పేరును ఖరారు చేశారు. బిసి సామాజిక తరగతికి చెందిన అనిల్‌కుమార్‌ను ఎంపిక చేయడం ద్వారా పల్నాడు జిల్లాలో వైసిపికి ఉన్న పట్టును మరింత పెంచుకునేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయులు వైసిపి నుంచి తప్పుకున్న తరువాత పలువురి పేర్లు తెరపైకి వచ్చినా చివరికి బీసీలకు ఇవ్వాలని సిఎం జగన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ వైపు మొగ్గు చూపారు.
గుంటూరు అభ్యర్థి ఎవరు ?
గుంటూరు లోక్‌సభ నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట రమణకు అవకాశం ఇస్తారని ప్రచారమవుతోంది. అయితే తమ వద్ద ఆర్ధిక స్థోమత లేదని వారు వెనుకంజ వేయడంతో తాజా జాబితాలో వెంకటరమణ పేరు రాలేదని వైసిపి వర్గాలు తెలిపాయి. వెంకట రమణ పోటీకి ముందుకు రాకపోతే గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడికు అవకాశం ఇవ్వొచ్చు. మనోహర్… పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ సోదరి షర్మిలపైనా ఆయన బుధవారం ఘాటువిమర్శలుచేశారు. కాపులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మనోహర్‌నాయుడు వైపు వైసిపి అధిష్టానం మొగ్గుచూపవచ్చు.