కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ మూడు ముక్కలాటగా మారిపోయింది. అక్కడ టిక్కెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోరాడుతున్నా ఆయనకు అనుభవం లేదని తమకే చాన్సివ్వాలని కొంత మంది సీనియర్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
వైసీపీ కంచుకోట ప్రొద్దుటూరు
వైఎస్ హయాంలో కాంగ్రెస్‌కి.. తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గతంలో రెండు సార్లు గెలిచినా.. ఆ పట్టు నిలబెట్టుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా ప్రొద్దుటూరులో టీడీపీ సత్తా చాటుతానంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు పార్టీ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి. ప్రొద్దుటూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాచమల్లును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామంటూ.. టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్‌తో పాటు ఇతర నేతలు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆక్రమంలో వారు రాచమల్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో చేస్తున్న నిరసనలు.. ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
పోరాడుతునన ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. గతంలో ఎవరు చేయని అభివృద్ధి తాను చేశానని.. ప్రొద్దుటూరు అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాచమల్లు చెబుతుంటే.. అవినీతి అక్రమాలు చేసి రాచమల్లు వేల కోట్లకు పడగలెత్తారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ని 50 రోజులు జైల్లో పెట్టించడం.. ప్రొద్దుటూరులో రాజకీయంగా దుమారం రేపింది. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ స్వయంగా వెళ్లి కడప సబ్ జైల్లో ప్రవీణ్‌ని పరామర్శించి.. ప్రొద్దుటూరు టికెట్ కన్ఫార్మ్ చేయడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ రాచమల్లును రాజకీయంగా ఎదుర్కోలేక.. వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.
ప్రవీణ్‌కు పోటీగా టిక్కెట్ రేసులోకి పలువురు టీడీపీ నేతలు
ప్రవీణ్ వ్యవహారాన్ని వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తనకు టీడీపీ టికెట్ ఇస్తే.. రాచమల్లు ను ఓడిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నమాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి.. వారిద్దరని పక్కకి నెట్టేస్తూ తానే ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసుకుంటున్నారు. వీరు చాలదన్నట్టు ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ పెట్టి.. గత 6 నెలలుగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు సీఎం సురేష్ నాయుడు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సోదరుడే ఈ సురేష్‌నాయుడు.. అధిష్టానం ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశానని సురేష్ నాయుడు చెప్పుకోవడం.. ఇప్పటికే ఉన్నవారితో తలలు పట్టుకుంటున్న టీడీపీ కార్యకర్తలను మరింత అయోమయానికి గురిచేస్తోంది.