శీతాకాలంలో గొంతు సమస్య చాలామందిని వేధిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులు, చలిగాలుల కారణంగా గొంతు పట్టేయడం, దగ్గు, జలుబు ఇబ్బందులు తప్పవు. గొంతు నొప్పి, మంట, గొంతు దగ్గర వాపు లాంటివి కొందర్లో కనిపిస్తాయి. వీటినుంచి ఉపశమనం కోసం ట్యాబ్లెట్స్ వినియోగించేకన్నా హెర్బల్ టీ తాగడం ఉత్తమం అంటారు ఆయుర్వేద నిపుణులు..
హెర్బల్ టీ అంటే
హెర్బల్ టీ ట్రూ టీ కాదు. ఇందులో ఆకులూ, పువ్వులూ, పళ్ళూ, వేర్లూ ఉంటాయి. వీటితో పాటూ కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి వాటిని మరగబెట్టి ఆ డికాషన్ తో తయారు చేసేదే హెర్బల్ టీ. హెర్బల్ టీలు కొన్ని వందల రకాలుగా అందుబాటులో ఉంటాయి. మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి హెర్బల్ టీ లో వెరైటీలు ఉంటాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా హెల్దీ గా ఉండాలి అనుకునే వారికి హెర్బల్ టీలు మంచి ఆప్షన్. శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే కొన్ని హెర్బల్ టీల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
పసుపు టీ
మరుగుతున్న నీటిలో రెండు చిటికెడుల పసుపు వేసి మరింత మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టుకుని తేనె కలుపుకుని తాగాలి. ఈ హెర్బల్ టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటూ కణజాలాల ఇబ్బందులను తగ్గిస్తుంది. గోరు వెచ్చగా ఈ టీ తాగడం వల్ల గొంతుకు హాయిగా అనిపిస్తుంది.
అల్లం టీ
గొంతు ఇబ్బందులు ఉన్నప్పుడు అల్లం టీ మంచి ఉపశమనం. నీటిలో అల్లం వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీటిని అలాగే తాగొచ్చు. లేదంటే రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గొంతు వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చామంతి టీ
మరుగుతున్న నీటిలో చామంతి రేకులను వేసుకుని టీ తయారు చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మంచిగా నిద్ర పట్టేలా చేస్తాయి. అందువల్ల గొంతు ఇబ్బందుల వల్ల తలెత్తే తల నొప్పులు, ముఖం బరువుగా ఉండటం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ టీ మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, మహిళల పీరియడ్స్ నొప్పుల్ని తగ్గించడంలోనూ కూడా చక్కగా పని చేస్తుంది.
పెప్పర్ మింట్ టీ
పుదీనా ఆకుల్లోనే పెప్పర్ మింట్ అనేది ఓ హైబ్రీడ్ రకం. దీని రుచి కాస్త స్పైసీగా ఉండి గొంతు సంబంధిత సమస్యలకు బాగా పనికి వచ్చేలా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శీతాకాలపు శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.