పులకించిన బెజవాడ – కనీ వినీ ఎరుగని రోడ్ షో !

విజయవాడలో ప్రధాని మోదీ కూటమి నేతలతో నిర్వహించిన రోడ్ షో అద్భుతంగా జరిగింది. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై ఫోటోలు, వీడియోలతో సహా పలు ట్వీట్లు చేశారు. ఏపీలో కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఆయన సంతృప్తి చెందారు. ఊహించిన దాని కంటే భారీగా గెలవబోతున్నామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

గుజరాత్ ను తలపించిన బెజవాడ రోడ్ షో

ప్రధాని మోదీ బహిరంగసభలతో పాటు ఎక్కువ మందిని కలిసేలా రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. ఈ సారి విజయవాడలో రోడ్ షో నిర్వహించాలనుకున్నారు. మాసివ్ రోడ్ షోలను నిర్వహించడంలో మోదీకి ప్రత్యేక శైలి. ఆయన గతంలో గుజరాత్ లో ఏక ధాటికి ఆరేడు గంటల పాటు రోడ్ షో నిర్వహించారు. బెంగళూరులోనూ అలాంటి భారీ ర్యాలీలు నిర్వహించారు. విజయవాడలో తొలి సారి నిర్వహించారు. అయితే గుజరాత్ లో సాగినట్లే రోడ్ షో సాగింది. దారి పొడవునా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు మోదీకి సంఘిభావం తెలిపారు.

మోదీ ప్రచారంతో కూటమిలో పెరిగిన నమ్మకం

ప్రధాని మోదీ రోజు మార్చి రోజు రెండు రోజులు ప్రచారం చేశారు. ఈ రెండు రోజులు జన జాతరే కనిపించింది. సాధారణంగా రాజకీయ పార్టీల సభలకు వచ్చేవారితో అయితే జనం ఓ మాదిరిగా కనిపిస్తారు. వారికి సాధారణ జనం కూడా తోడైతే.. జన జాతర తలపిస్తుంది. మోదీ సభలు అలాగే జరిగాయి. కూటమి పార్టీల కార్యకర్తలకు తోడు సామాన్య జనం తరలి వచ్చారు. మూడో సారి మోదీ ప్రధాని కావాలని కోరుకున్నారు.

సమన్వయంతో కూటమి పార్టీలు

కూటమిలో ఎవరికి నష్టం జరిగినా మొత్తం కూటమికి నష్టం జరుగుతుంది. అందుకే కూటమి పార్టీలు సమన్వయం చేసుకోవడంలో కీలక పాత్రపోషిస్తున్నాయి. అవకాశాలు దక్కకపోయినా సీనియర్లు పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు జీవీఎల్ నరసింహారావు వంటి వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సమన్వయం పెరగడంతో కూటమికి ఓటు ట్రాన్స్ ఫర్ సులువుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.