గోదావరి జిల్లాల్లో ఆ ఇద్దరు మాజీ ఎంపీల చూపు బీజేపీ వైపు !?

మూడో సారి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు వెలువడుతూండటంతో .. బీజేపీలోకి చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చేరికలు ఎక్కువగా ఉండనున్నాయి. ఏపీలో ఈ సారి ఎవరూ ఊహించని చేరికలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన తెర వెనుక చర్చలను చేరిక ల కోసం ప్రారంభించారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇద్దరు మాజీ ఎంపీలు బీజేపీలో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లగా చెబుతున్నారు.

కాంగ్రెస్ కు ఉనికి లేకపోవడంతో నేతల పక్క చూపులు

కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీలకు ఇప్పుడు కనీస పలుకుబడి కూడా లేకుండా పోయింది. దీంతో వారు రాజకీయంగా మెరుగైన స్థితి కోసం మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు. ఇంత కాలం వారికి ఎలా చేరాలో అర్థం కాలేదు. చేరితే ఎలాంటి గౌరవం లభిస్తుందో తెలియదు. తమకు సన్నిహితుడు అయిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంతో వారికి మంచి ఫ్లాట్ ఫామ్ లభించినట్లయింది. పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికలలో పోటీ చేస్త మోదీ వేవ్‌తో గెలుస్తామని వారు నమ్మకంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు కొంత సర్వేలు చేయించుకుని ముందడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

గోదావరి జిల్లాల్లో బలంగా బీజేపీ !

ఉమ్మడి రాష్ట్రంలో కూడాగోదావరి జిల్లాల్లో భారతీయ జనతా బలంగా ఉంది. నర్సాపురం లోక్ సభ స్థానాన్ని పలుమార్లు గెల్చుకుంది కూడా. రాజమండ్రిలోనూ బీజేపీకి బలం ఉంది. రెండు గోదావరి జిల్లాల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ సానుభూతిపరులు ఉన్నారు. అయితే బలమైన నాయకుల కొరత ఉండటం..ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో వైఫల్యం వల్ల ఓటింగ్ శాతం పెంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు కీలక నేతలు చేరితే.. బీజేపీ ఓటు బ్యాంక్ మొత్తం కన్సాలిడేట్ అవుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ ఇద్దరు మాజీ ఎంపీలు కూడా ఇదే ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు.

పొత్తుల గురించి ఆలోచించని బీజేపీ నాయకత్వం !

ఏపీ బీజేపీ నాయకత్వం పొత్తుల గురించి ఆలోచించడం లేదు. బలమైన స్థానాలను ఎంపిక చేసి ఆపరేషన్ ప్రారంభించింది. బీజేపీ బలానికి ఎంతో కొంత వ్యక్తిగత బలం జత చేసి పార్టీకి విజయాన్ని అందించే నేతలు వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. పార్టీకి బలమయ్యేవారు కావాలి కానీ పార్టీని ఉపయోగించుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేరును ఉపయోగించుకునేందుకు లాబీయింగ్ చేసుకునేందుకు వచ్చే నేతల్ని మాత్రం ఎంటర్ టెయిన్ చేయకూడదని బీజేపీ నాయకత్వం నిర్ణయించుకుంది.అందుకే బీజేపీలో చేరే నేతలు పరిమితంగానే ఉన్నా.. పార్టీకి ఉపయోగపడేవారే ఉంటారని చెబుతున్నారు.