దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా…దేవుడున్నాడని విశ్వసిస్తారా?…ఈ రెండింటిలో ఒకటి నమ్మితే మరొకటి కూడా నమ్మాలి. ఎందుకంటే ఒకటి పాజిటివ్ ఎనర్జీ..మరొకటి నెగెటివ్ ఎనర్జీ కాబట్టి. దయ్యాలు ఉన్నాయని ఎందుకు నమ్మాలంటే..ఒక్కరాత్రిలో దయ్యారు నిర్మించిన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం…
స్థల పురాణం
కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఉంది సుందరేశ్వరాలయం. సుందరేశ్వరుడు అంటే శివుడు. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారు. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని చెప్పాడు. ఊరంతా కలసి గుడి నిర్మించారు. కానీ దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేశాయి.
ఒక్క రాత్రిలో నిర్మించిన ఆలయం
దయ్యాలు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో వాటిని వశం చేసుకుని జుట్టు కత్తిరించి బంధించాడు. తమను విడిపించాలని దయ్యాలు వేడుకోవడంతో…పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడు. ఇక చేసేదిలేక రాత్రికి రాత్రే గుడి నిర్మించిన దెయ్యాలు అక్కడి నుంచి మాయమైపోయాయి.
ఆలయం గోడలపై దయ్యాల బొమ్మలు
ఏ ఆలయంపైన అయినా దేవుడి బొమ్మలు, నృత్య భంగిమలు ఉంటే ఈ గుడిపై మాత్రం దెయ్యాల బొమ్మలుంటాయి. అయితే గుడిని మళ్లీ నిర్మించిన దెయ్యాలు శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయట పడింది. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించి అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. భూతనాథుడిని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడి వారికి అంతా మంచే జరిగిందట. అందుకే దెయ్యాలు నిర్మించిన దేవాలయం అని పేరుపెట్టేసుకుని సుందరేశ్వరుడిని పూజిస్తున్నారు. .
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.