‘అయోధ్య’ రామాలయంలో ప్రతిష్టింతే ‘రామ్ లల్లా’ విగ్రహం ఎంపిక ఫైనల్ అయింది. ముగ్గురు శిల్పులు పోటాపోటీగా చెక్కిన విగ్రహాల్లో కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహం ఫైనలైంది. ఈ నెల 22 న అయోధ్య రామమందిరం గర్భగుడిలో కొలువుతీరి పూజలందుకోనుంది ఈ విగ్రహం.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ విగ్రహాన్ని చెక్కిందెవరు?
హనుమంతుడి జన్మభూమి నుంచి శ్రీరాముడి సేవాకార్యం
రామమందిరంలో ప్రతిష్టించే విగ్రహం ఫైనల్ అయిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఫోటో షేర్ చేశారు. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరో ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచి శ్రీరాముని సేవా కార్యం జరిగిందనడంలో సందేహం లేదు.’ అని ట్వీట్ చేశారు.
విగ్రహ తయారీ పోటీలో ముగ్గురు
‘అయోధ్య’లో ప్రతిష్టించబోయే రాముని విగ్రహం కోసం డిసెంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.పోటీలోని 3 విగ్రహాలను పరిశీలించి తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ట్రస్టుకు సమర్పించారు. కర్ణాటక నుంచే మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ పాండేలు కూడా పోటీలో పాల్గొన్నారు. ముంబయికి చెందిన ఆర్టిస్ట్ వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ల ఆధారంగా ‘రామ్ లల్లా’ను డిజైన్ చేశారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీనిపై కర్ణాటక బీజేపీ నేత యుడియూరప్ప ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఇది రాష్ట్రంలోని మొత్తం రామ భక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని పేర్కొన్నారు.
ఉద్యోగం మానేసి శిల్పిగా మారిన అరుణ్
కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ ఎంబీయే పూర్తి చేసి ఉద్యోగం వదిలేసి శిల్పిగా మారారు. యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. కేదార్ నాథ్ లో ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూరులోని మహారాజ శ్రీకృష్ణరాజ వడయార్-IV, 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, స్వామి రామకృష్ణ పాలరాతి విగ్రహం సహా ఎందరో ప్రముఖుల విగ్రహాలు కూడా తీర్చిదిద్దారు అరుణ్. ఇండియాగేట్ సమీపంలో అమర్ జవాన్ జ్యోతి వెనుక ప్రముఖంగా కనిపించే సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ రూపొందించినదే. ఈ విగ్రహాన్ని చూసిన ప్రజలు దైవత్వాన్ని అనుభూతి చెందాలి. చిన్నారి లాంటి ముఖంతో పాటు దైవత్వ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని 6 నెలల క్రితం శిల్పం చెక్కడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు అరుణ్. అయితే విగ్రహం ప్రతిష్టాపనకు ఎంపికవడం కన్నా తన సృజనను ప్రజలు మెచ్చుకున్నప్పుడే ఇంకా సంతోషంగా ఉంటానని చెప్పారు. అరుణ్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు…