అయోధ్య రామ మందిరంపై ఎగిరే జెండా సిద్ధమైంది. సూర్యుడు, దేవ కాంచన సెట్టు ప్రధానంగా కనిపిస్తున్నాయ్..ఇంకా ఈ జెండా ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..
సూర్య వంశ చిహ్నం ప్రధానం
రామ మందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండా చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. సూర్యవంశ చిహ్నం సూర్యుడు..అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలిచారు. రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ దీనిని ఫైనల్ చేశారు. ఈ జెండాపై ఏమున్నాయంటే.. ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై శ్రీ రామ్ నినాదం, కోవిదర్ చెట్టు (దేవ కాంచన చెట్టు) చిత్రీకరించారు.
మధ్యప్రదేశ్ లో తయారీ
శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి 100 జెండాలను పంపుతున్నారు. రేవాలోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు. ఈ మధ్యే రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి లలిత్ మిశ్రా రామాలయం జెండా ముసాయిదాను కూడా అందించారు. ఐదుగురు సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్‌ను కమిటీ ముందుంచనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలిచారని లలిత్ మిశ్రా చెప్పారు. దేవ కాంచన చెట్టు, అయోధ్య రాజ వృక్షం. భారతదేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తున్నట్లుగా ఆ సమయంలో దేవ కాంచన చెట్టుని రాజ వృక్షంగా పరిగణించేవారు.
పురాణాలలో దేవ కాంచన చెట్టు ప్రస్తావన
హిందువులకు దేవ కాంచన చెట్టు చాలా ముఖ్యమైనది. దీని ప్రస్తావన పురాణాలలో కూడా కనిపిస్తుంది. పురాణ విశ్వాసాల ప్రకారం ఋషి కశ్యపుడు ఈ చెట్టును సృష్టించాడు. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో కూడా ఉంది. ఈ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని దేవ కాంచన చెట్టుని అయోధ్య రాజ జెండాలో చిత్రీకరించారు. అందుకే రామాలయంలో జెండాలో ఈ చెట్టుని చిహ్నంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.
రామాయణంలోనూ దేవకాంచ చెట్టు ప్రస్తావన
వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఈ చెట్టుని ప్రస్తావించారు.ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయి. రామాయణంలో శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించడానికి భరతుడు చిత్రకూటానికి వెళ్లినప్పుడు భరతుడి రథంపై ఉన్న జెండాపై దేవ కాంచన చెట్టు ఉన్నట్లు వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. అన్న రామయ్యతో పాటు వనవాసంలో ఉన్న లక్ష్మణుడు దూరం నుంచి ఆ జెండాను చూసి .. తమ వైపు వస్తోంది అయోధ్య సైన్యం మాత్రమే అని గుర్తించారు.