సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య విశిష్టత ఇదే!

సప్త మోక్షదాయక క్షేత్రాలుగా చెప్పే ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మణ, గురువు, బంధు పరివారం హత్యదోష నివారణార్థం ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. అంత మహిమాన్వితమైన సప్తపురి క్షేత్రాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య.

రామచంద్రుడు పుట్టిపెరిగిన పుణ్యభూమి
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి. రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకుడు, పృథు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు, దిలీపుడు, దశరథుడు, రాముడు వంటి ప్రఖ్యాత చక్రవర్తులు పరిపాలించారు.

దశరథుడి పాలనలో అయోధ్య ఇలా ఉండేది
శ్రీరాముని తండ్రైన దశరథ మహారాజు ఇక్ష్వాకుల రాజులలో అగ్రగణ్యుడు. శతృభయంకరుడు, అతిరథుడు, పండితపక్షపాతి. విశాల దృక్పథమూ, అపార దూరదృష్టిగలవాడు, మహాతేజోవంతుడు, అయోధ్యలో కేవలం పౌరులేకాక, అడవులలో నివసించే జానపదులు కూడా దశరథుని పట్ల ప్రేమపాత్రులై ఉండేవారు. ఎన్నో యాగాలు చేసి, ఎందరో బ్రాహ్మణులకు దానాలిచ్చి ఇటు రాజులను, అటు ఋషులను, సర్వజనుల అభిమానం సంపాదించుకున్నాడు. మిత్ర సంపద కలిగినవాడు, ధనంలో కుబేరునితో సమానుడు, ఇంద్రియాలను జయించినవాడు ధశరథుడు.

నాస్తికులు ఉండేవారు కాదు
అయోధ్య నగర వాసులందరూ ధర్మపరులు. తమకున్నంతలో సంతృప్తి చెందేవారు, సర్వశాస్త్ర పారంగతులు. ధర్మార్థకామాలనే పురుషార్థాలకై పాటుపడనివారు లేరు. ధనధాన్యాలతో నిత్యసంపదలతో తులతూగేవారు. లోభి, కాముకుడు, విద్యాహీనుడు, నాస్తికుడు వెతికినా కనిపించేవాడు కాదు. ఆ నగరంలో స్త్రీలు, పురుషులు ధర్మపరులుగా ఇంద్రియనిగ్రహం కలిగి ఉండేవారు. నిత్యకర్మలను తప్పకుండా ఆచరించేవారు.

శత్రువులు సమీపంలోకి కూడా వచ్చేవాడు కాదు
దశరథుని సైన్యం సింధుదేశంలో పుట్టిన మేలుజాతి గుర్రాలతో నిండి ఉండేది. ఐరావతజాతి, అంజనజాతి, వామనజాతికి చెందిన ఏనుగులెన్నో ఉండేవి. అయోధ్యకు బయట కూడా రెండు యోజనాల వరకు శత్రువులు అడుగుపెట్టలేనంతగా ఉండేది. దశరథుడి హయాంలో అయోధ్య అంతలా ప్రకాశించింది.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.