చరిత్రలో 60 సీట్లు ఎప్పుడూ గెలవని హస్తం – తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ

తెలంగాణలో గెలిచేస్తామని 70 సీట్లు సాధిస్తామని మీడియా, సోషల్ మీడియాల ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నకాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కూడా ఎప్పుడూ తెలంగాణలో మెజార్టీ మార్క్ ను కాంగ్రెస్ సాధించలేదు. రికార్డులే ఆ విషయాన్ని చెబుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడూ బలహీనమే

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 60 సీట్ల‌కు పైగా సాధించ‌లేదు. 1989 ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా 59 స్థానాల్లో గెలుపొందింది. నాడు ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు 181 సీట్లు వ‌చ్చాయి. 1989లో పీసీసీ అధ్య‌క్షుడు నెద‌రుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి. 1999 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 42 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. 1994 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు వ‌చ్చింది కేవ‌లం 26 సీట్లు మాత్ర‌మే. 1999, 1994లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 2004 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా, తెలంగాణ‌లో వ‌చ్చిన‌వి 48 మాత్ర‌మే. 2009లో 156 స్థానాల్లో గెలుపొంద‌గా, తెలంగాణ‌లో 49 స్థానాల్లో గెలుపొందింది హ‌స్తం పార్టీ.

రాష్ట్రం విడిపోయాక మరింత ఘోరం

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అదే ఏడాది శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 21 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో 19 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. క‌నీసం మేజిక్ ఫిగ‌ర్ 60ని కూడా అందుకోలేక‌పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో మేజిక్ ఫిగ‌ర్‌ను దాటి అధికారాన్ని కైవ‌సం చేసుకోబోతున్నామ‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం ధీమాతో ఉంది. కాగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా పొన్నాల ల‌క్ష్మ‌య్య ఉన్నారు. 2018 ఎన్నిక‌ల‌ప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బ‌రిలో ఉంది. రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడిగా నియామ‌క‌మైన త‌ర్వాత జ‌రుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు.

ఎప్పుడూ లేని విజయం ఇప్పుడెలా సాధ్యం ?

గత 30 ఏండ్ల‌ చరిత్రను ప‌రిశీలిస్తే, కాంగ్రెస్‌కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. 60 సీట్లు ఏనాడూ దాటలేదు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సాధించిన విజ‌యం అంతంతమాత్రమే. ఈ సారి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది. గత 30 ఏండ్ల‌లో ఎప్పుడూ అందనంత భారీ విజయాన్ని అందుకోవాలి. మేజిక్ ఫిగర్‌ను దాటాలంటే, 30 ఏళ్ల క్రితం ఎలా గెలిచిందో, ఇప్పుడు అలాంటి ప్రదర్శనే చేయాల్సి ఉంటుంది. కుంచించుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి అది ఎలా సాధ్యమన్న అంచనాలు సహజంగానే వినిపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రచారాన్ని ఎవరూ నమ్మడం లేదు.