బీఆర్ఎస్ నుంచి మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు పాతిక కోట్లు అందాయని ఈటల రాజేందర్ అన్నారు. అసలు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అని అన్నానని రేవంత్ మాత్రం ఎమోషనల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పైచేయి కోసం.. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనే మాట వినిపించకుండా ఉండటం కోసం.. ఈటల రాజేందర్ కాంగ్రెస్ ను అన్న మాటల్ని తనకు అన్వయించుకుని రాజకీయం చేశారు.
బీఆర్ఎస్‌తో పొత్తు వద్దని హైకమాండ్‌కు హెచ్చరిక
తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం అని మల్లిఖార్జున ఖర్గే ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నేరుగా ప్రకటించేశారు. కానీ అదే సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భీకరమైన ప్రకటనలు చేశారు. దేశ రాజకీయాల్లో ఇటీవల వస్తున్న మార్పుల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఐక్యతా సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా .. బీఆర్ెస్ పార్టీతో కలిసి వెళ్లడం గురించి ఆలోచిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది బీఆర్ఎస్ తో పొత్తు అవసరం అని వాదిస్తున్నారు. బీజేపీ గెలుపును అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలవాలని అంటున్నారు. అందుకే ఆ రెండు పార్టీలు కలుస్తాయన్న ప్రచారం ఊపందుకుంటూడటంతో రేవంత్ రెడ్డికి ఉక్కపోత మొదలైంది. అందుకే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్ని అడ్డం పెట్టుకుని ఆయన కేసీఆర్ పై పోరాటంలో తాము ఎంత తెగిస్తున్నామో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటల మాటల్ని రేవంత్ వాడుకున్నారు. కేసీఆర్ తో పొత్తు అనే మాటలను రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఆయన పోరాటం కేసీఆర్ తో ముడిపడి ఉంది. ఇటీవల తమ హైకమాండ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతోందని తెలిసి… తాను పీసీసీ చీఫ్ గా ఉండగా పొత్తులు పెట్టుకునే అవకాశమే లేదని ప్రకటించారు. ఓ రకంగాఇది హైకమాండ్ ను బెదిరించడమే అనుకోవచ్చు.
కంటతడి పెట్టుకుని తెలంగాణ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం !
రేవంత్ రెడ్డి రాజకీయంగా ఉన్నత పదవి కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో తనను కించపరుస్తున్నా.. పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నట్లుగా ఎవరూ కష్టపడటం లేదు. ఇవన్నీ ప్రజల ముందు ఉంచి.. కంటతడి పెట్టారు రేవంత్ రెడ్డి . అంటే సానుభూతి వ్యూహం కూడా అమలు చేశారన్నమాట. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌పై తన పోరాటాన్నిబలంగా చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టారో చెప్పారు. భయం అనేది తన ఇంట్లోనే లేదని స్పష్టం చేశారు. తనన నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని నొటొరియస్ క్రిమినల్స్ పెట్టె సెల్స్‌లో పెట్టారన్నారు. ఎన్ని కష్టాలు పడ్డామో ఆయన ఆవేదనా స్వరంతో గుర్తుచేసుకున్నారు.
ఈటల మాటలు సాకు మాత్రమే !
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ రూ. పాతిక కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకే ఆ పార్టీ బలంగా ప్రయత్నించిందని ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. కాను కేసీఆర్ వద్ద రూ. పాతిక కోట్లు తీసుకున్నానని ఈటల ఆరోపించారని.. పైసా కూడా తీసుకోలేదని చాలెంజ్ చేసి.. ఆలయంలో ప్రమాణానికి సిద్ధమయ్యారు. రేవంత్ ఇలా తనను అనని మాటను తన మీద వేసుకోవడమే కాదు.. ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఇది ఓ రకంగా క్లిష్టమైన రాజకీయ వ్యూహం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి మార్గం లేదని రేవంత్ రెడ్డి అనుకుని ఉండవచ్చు. దాన్నే అమలు చేశారు.