తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఎంత పెద్దగా ఉంటుందో…గర్భగుడిలో ఉన్న శివలింగం కూడా అంతే పెద్దగా ఉంటుంది. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయం తమిళనాడు లో అతి పెద్ద ఆలయాలలో ఒకటి. దీని విశిష్టత ఏంటంటే..
శివుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం
చోళ రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన ఆళయం ఇది. ప్రశాంతంగా, భక్తుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా ఉంటుంది. మహాలింగేశ్వరుని చుట్టూ ఆర్చిలో వెలిగించిన దీపాలు దూరం నుంచే కనులవిందు చేస్తాయి. సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్టింపజేసి దానికి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభువుగా వెలుస్తుంది. అయితే అరుదైన విషయం ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని స్వయంగా శివుడే ప్రతిష్టించాడు. అక్కడే చాలా ఏళ్లు తపస్సు చేసి ఆ శక్తిని ఇక్కడున్న శివలింగంలో ప్రవేశపెట్టారని చెబుతారు. అందువల్లే ఈ శివలింగానికి అంత శక్తి వచ్చిందని నమ్మకం. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసివారికి ఏ విధమైన మానసిక బాధలు ఉండవు. వివాహం, పిల్లలు, ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి.
మద్ది చెట్లు ప్రత్యేకం
ఈ ఆలయం ప్రాంగణంలో తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇలాంటి మద్దిచెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్లున్నాయి.
మరెన్నో విశిష్టతలు
ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయం ఉంది. సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన కలశం మొదట భూమి పై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అలాంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ ఉంది. ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న చొన్ననాధుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయంను హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..