పరమేశ్వరుడు మూడోకన్ను తెరిస్తే భస్మమే. అలాంటి ఉగ్రరూపుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లు వరదరా పారి కొలనులా మారింది. ఇంతకీ ఆ కొలను ఎక్కడుంది? ఆ విశేషాలేంటో చూద్దాం..
కటాస్‌రాజ్ ఆలయం
పరమశివుడు కంటనీరు పెట్టిన చోటు పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్‌లోని అత్యంత పురాతనమైన ఆలయం ఇది. భారతీయ పురాణాలలో ప్రస్తావన ఉన్న పవిత్రమైన ప్రదేశం ఇది. దీని పేరు కటాస్‌రాజ్ ఆలయం. పంజాబ్ రాష్ట్రంలోని చక్వాల్ జిల్లాలో ఉంది ఈ చారిత్రక ఆలయం. శివరాత్రి సమయంలో భారత్ లోని హిందువులు కూడా భారీగా తరలివెళ్లి దర్శించుకుంటారు.
పాక్ లో టూరిస్ట్ స్పాట్
కటాస్‌రాజ్ ఆలయం పాకిస్తాన్‌లోని ఒక ప్రధాన టూరిస్ట్ స్పాట్. పాక్ లోని ముస్లింలు కూడా గొప్పగా చెప్పుకునే దేవాలయం ఇది. మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా కటాస్‌రాజ్ ఆలయం గురించి చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాడు. ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు వెళుతూ ఈ ఆలయ గొప్పతనం గురించి వివరించాడు.
శివుడి కంటనీరు పడిన ప్రదేశం
దక్ష ప్రజాపతి తలపెట్టిన మహాయజ్ఞానికి తన బిడ్డ అయిన సతీదేవిని, అల్లుడు శివుడిని ఆహ్వానించడు. అయినప్పటికీ అక్కడకు వెళ్లిన సతీదేవి అవమానాలు ఎదుర్కొంటుంది. అది భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. సతీదేవి ఆత్మార్పణం పరమేశ్వరుడిని తీవ్రంగా బాధిస్తుంది.. ఓ వైపు ఉగ్రరూపం దాల్చినా మరోవైపు కంట కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా పరమేశ్వరుడి కంటవచ్చిన నీటితో కటాస్‌రాజ్ తటాకం ఏర్పడిందని చెబుతారు. కటాస్ అన్న పేరుకు మూలం కటాక్ష అనే సంస్కృత పదం. కటాస్ అంటే కన్నీటి ఊట అని అర్థం. దీనికి అమర్‌కుండ్, చమస్‌కుండ్, కటాక్షకుండ్ అనే పేర్లు ఉండేవి. కటాస్‌రాజ్ తటాకాన్ని ఉర్దూలో చష్మ్-ఎ-ఆలమ్ అంటున్నారు. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. రాముడు, హనుమంతుడు, శివుడి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
యక్షుడు పాండవుల్ని ప్రశ్నలు అడిగిన ప్రదేశం
కటాస్‌రాజ్ ఆలయంలోని శివలింగాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా తయారుచేసినట్లుగా చెబుతారు. అందుకే ఈ తీర్థక్షేత్రానికి అంతటి ఘనకీర్తి లభించింది. పాండవులు తమ వనవాసంలో భాగంగా ఇక్కడ గడిపారట. అలాగే యక్షుడు పాండవుల్ని ప్రశ్నలు అడిగిన ప్రదేశం కూడా ఇదే అంటారు.
దేశవిభజనకు ముందు కటాస్‌రాజ్ టెంపుల్‌కు భారతీయులు కూడా వెళ్లేవారు. కానీ కాలక్రమేణా భారత్ నుంచి రాకపోకలు తగ్గిపోయాయి. 2005లో నాటి ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ ఈ కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. పునరుద్ధరణకు చర్యలు చేపడతామని పాక్ సర్కార్ అప్పట్లో తెలిపింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం వల్ల, అక్కడి అస్థిరత వల్ల- భారతీయులు కాలక్రమేణా కటాస్‌రాజ్ టెంపుల్‌ను సందర్శించడం తగ్గిపోయింది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.