హిందూ సంస్కృతిలో పాటించే ప్రతి పద్ధతి వెనుకా అర్థం, పరమార్థం ఉంటుంది. అందులో ఒకటి ఆలయాల్లో గంట మోగించడం. ప్రతి ఆలయంలో గంటెందుకు ఉంటుంది. ఏ ఆలయంలో అడుగుపెట్టినా అప్రయత్నంగా గంట మోగిస్తారు. ముఖ్యంగా గుడిలో హారతి, కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడతారు.ఆ గంట మోగించడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా…
శ్లోకం
ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం
కురుఘంటారావం తత్ర
దేవతాహ్వానలాంఛనం…
దేవతలను ఆహ్వానిస్తూ, రాక్షసగణాలను తరిమికొట్టేందుకు పూజ ప్రారంభానికి ముందు గంట మోగిస్తున్నామని అర్థం
-ఆలయంలో గంట మోగించడం అంటే గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి కోరడానికి సంకేతం. గుడిలో గంటను మోగించినప్పుడు ఆ శబ్దం మన మనస్సు, మెదడు అన్ని చక్రాలను క్రియాశీలం చేస్తుంది.
-ఆలయ గంటను మోగించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆలయాన్ని సందర్శించి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందనే మాట వినేఉంటారు కదా దాని వెనుకున్న కారణం ఇదే
-గుడి గంటను మోగించడం ద్వారా భగవంతుడిని మేల్కొల్పవచ్చు. అందుకే గుడిలోకి ప్రవేశించేటప్పుడు, ఆలయం నుంచి తిరిగి వచ్చేటపుడు గంట మోగించాలి.
- ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం వల్ల శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. మీరు గుడి నుంచి బయలుదేరే ముందు గంటను మోగిస్తే, మీ సందేశం నేరుగా దేవునికి చేరుతుంది.
- గంట ఓం శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణిస్తారు..అందుకే గంట కొడతారు. గంట మోగిస్తే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. గంట శబ్దం ఎక్కడైతే క్రమం తప్పకుండా వస్తుందో అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.
- స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు
- గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. లయబద్ధమైన గంట శబ్దం మనస్సు నుంచి ఉద్విగ్నతను తొలగించి శాంతిని ఇస్తుంది. నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
- కాలచక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతం గా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది.
గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత
గంట నాలుక భాగంలో సరస్వతి దేవి, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర , హనుమా, నందీశ్వరుడు ఉంటారు…హారతి సమయంలో అందరి దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం