పూజలో మొదటగా చదివే కేశవనామాల వెనుక ఆంతర్యం ఇదే!

ఏదైనా పూజ ప్రారంభించేటప్పుడు కేశవ, నారాయణ, మాధవ, గోవింద అంటూ ప్రారంభిస్తారు. ఇవి మొత్తం 24 ఉంటాయి..ఇవి శ్రీ మహావిష్ణువు 24 నామాలు. ఇక అష్టోత్తరం, సహస్రనామాలు కూడా ఉన్నప్పటికీ ప్రతి పూజలో కేశవ నామాలు మాత్రం తప్పనిసరి..వీటితోనే పూజ ప్రారంభిస్తారు.
ఈ 24 నామాల వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా. కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు అందుకు ప్రతీకగా 24 నామాలు. ఇక కేశవ నామాల వెనుక కూడా ఓ రహస్యం ఉంది. శ్రీ మహావిష్ణువును చతుర్భుజుడు అంటారు. చతుర్భుజుడు అంటే నాలుగు చేతులు కలిగిన వాడు అని అర్థం. నాలుగు చేతులలో శంఖు, చక్ర, గదా, పద్మాలు పట్టుకుని ఉంటాడు విష్ణువు. ఎక్కడైనా సరే అలాగే దర్శనం ఇస్తాడు కూడా. బాగా గమనిస్తే ఈ నాలుగు ఆయుధాల అమరికలో వచ్చే మార్పుల వల్లనే శ్రీ మహావిష్ణువుకు 24 వేరు వేరు రూపాలు ఏర్పడతాయని ఆ రూపాలకు కలిగిన పేర్లనే కేశవనామాలు అంటున్నారు.

ఈ కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖం పట్టుకుని ఉంటాడు. ఎడమ వైపున్న రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు. ఈ మాధవ రూపంలో కుడి వైపు రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు. ఎడమవైపు ఉన్న రెండు చేతులతో పద్మము,శంఖము పట్టుకుని ఉంటాడు. మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో చక్రం, శంఖము..ఎడమవైపు చేతులతో గద,పద్మము పట్టుకుని ఉంటాడు. ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పౌర్ణమికి, అమావాస్యకు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు. ఇలా మారుతున్న రూపాలకు అనుగుణంగానే కేశవనామాలు ఏర్పడ్డాయి. సంవత్సరానికి 12 నెలలు..నెలలో రెండు సార్లు ఆయుధాలను మార్చుకుంటాడు. కాబట్టి ఇరవైనాలుగు సార్లు జరిగిన మార్పులకు ఇరవై నాలుగు నామాలు ఏర్పడ్డాయని చెబుతారు.

ఈ మార్పులను లేదా అమరికలను గణిత శాస్త్ర పరంగా ప్రస్తారాలు అంటారు.. అంటే 4 వస్తువులను 4 విధాలుగా అమర్చవచ్చు.

4 = 4×3×2×1=24

శంఖాన్ని ‘శ’ తోను,

చక్రాన్ని ‘చ’ తోను,

గదను ‘గ’ తోను,

పద్మాన్ని ‘ ప’తోను సూచిస్తే,

ఆ 24 అమరికలు ఇలా ఉంటాయి

1) శచగప 2) శచపగ 3) శపచగ 4) శపగచ 5)శగచప 6)శగపచ

7)చపగశ 8)చపశగ 9)చగపశ 10)చగశప 11)చశగప 12)చశపగ

13)గపశచ 14)గపచశ 15)గచశప 16)గచపశ 17)గశపచ 18)గశచప

19)పచగశ 20)పతశగ 21)పశగచ 22)పశచగ 23)పగశచ 24)పగచశ

కేశవనామాలు
కేశవ,నారాయణ, మాధవ,గోవింద, విష్ణు,మధుసూధన, త్రివిక్రమ,వామన, శ్రీధర,హృషీకేశ, పద్మనాభ,దామోదర, సంకర్షణ,వాసుదేవ, అనిరుధ్ధ,ప్రద్యుమ్న, పురుషోత్తమ,అధోక్షజ, నారసింహ,అచ్యుత, జనార్ధన,ఉపేంద్ర, హరి శ్రీకృష్ణ, ఇదీ కేశవనామాల వెనకున్న శాస్త్రీయ కారణం.