వినాయకుడు అనగానే…ఏనుగు తల, భారీ బొజ్జ రూపం కళ్లముందు కనిపిస్తుంది. కానీ లంబోదరుడి అసలు రూపం ఎలా ఉండేదో తెలుసా..ఆ రూపాన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే…
గజాసురుడి తపస్సుకి మెచ్చి తన ఉదరంలో ఉండిపోతాడు శివుడు. తన భర్తను విడిపించి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువుని కోరుతుంది పార్వతి. అప్పుడు గంగిరెద్దులను ఆడించే వేషధారణలో వెళ్లిన విష్ణువు, నంది..గజాసురుడిని మెప్పించి శివుడిని బయటకు తీసుకొస్తారు. ఆ సంగతి తెలుసుకున్న పార్వతి..భర్తకి ఘనంగా ఆహ్వానం పలికేందుకు అభ్యంగనం స్నానం చేసేందుకు వెళుతుంది. ఒంటికి నలుగుపెట్టుకుని ఏదో పరధ్యానంలో ఉంటూ ఓ బొమ్మని తయారు చేస్తుంది. తండ్రి గతంలో తనకిచ్చిన వరాన్ని ఉపయోగించి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. ఆ బాలుడ్ని ద్వారం దగ్గర కాపలాగా ఉంచి స్నానానికి వెళుతుంది పార్వతి. అప్పుడు వచ్చిన శివుడిని అడ్డుకుంటాడు బాలుడు. ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో శిరస్సు ఖండిస్తాడు.ఆ తర్వాత పార్వతీ దేవి శోకాన్ని చూసి గజాసురిడితల అతికిస్తాడు…అలా వినాయకుడు గజాననుడు అయ్యాడు. ఈ కథ అందరికీ తెలుసు..ఇప్పుడు పూజిస్తున్న రూపం కూడా ఇదే…మరి అసలు వినాయకుడు ఎలా ఉండేవాడు..
వినాయకుడి అసలు రూపం
ఏనుగు తల, బొజ్జలేని గణపతిగా పార్వతి తయారు చేసిన బొమ్మ రూపం కొలువైన ఆలయం తమిళనాడులో ఉంది. దీన్నే ఆదివినాయకుడు, నరముఖ గణపతి ఆలయం అని పిలుస్తారు. తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయం ఇది. పితృదోషాలతో బాధపడుతున్నవారు ఇక్కడ కొలువైన నరముఖ వినాయకుడిని దర్శించుకుని ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.
శ్రీరాముడు పితృకార్యం నిర్వహించింది ఇక్కడే
ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించాడట. దేశం మొత్తం ఎన్నిచోట్ల తిరిగి….పితృకార్యం నిర్వహించినా దశరథుడికి ముక్తి లభించకపోవడంతో పరమశివుడుని ప్రార్థించాడట. ముక్తీశ్వరాలయంలో ఉన్న కొలనులో స్నానమాచరించి తండ్రికి తర్పణాలు వదలమని శివుడు చెప్పాడట. అప్పటి నుంచే ఈ ఊరికి తిలతర్పణ పురి అనే పేరు వచ్చిందని చెబుతారు. తిలం అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం అని అర్థం.
కాశీ-రామేశ్వరంతో సమానమైన పుణ్యప్రదేశం
ఈ ఆలయం భారతదేశంలో ప్రముఖ క్షేత్రాలుగా చెప్పుకునే కాశీ, రామేశ్వరం, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా భావిస్తారు . అందుకే ఎవరైతే పెద్దలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడతారో వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించి తర్పణాలు వదలితే ఆ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.