సంగీతాన్ని ప్రతిధ్వనించే మెట్లున్న ఆలయం ఇది – ఇక్కడ శిల్పాలు చాలా ప్రత్యేకం!

మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలెన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాల్లో దారాసుర ఆలయం ఒకటి. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. కుంభ కోణానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో తంజావూర్ వెళ్ళే మార్గంలో ఉన్న ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి…

బృహదీశ్వర ఆలయం నమూనాలో!
శిల్పకళాశోభితమైన దారాసుర ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజచోళుడు నిర్మించాడు. అయితే శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు, గంగైకొండ చోళపురం ఆణిముత్యాల లాంటివి. అదే కోవకి చెందిన మరో ఆలయం శ్రీ ఐరావతేశ్వర స్వామి కొలువైన దారాసురంలో ఉంది. ఇక్కడ శివుని పేరు ‘ఐరావతేశ్వరుడు’. 12వ శతాబ్థంలో చోళులు నిర్మించిన ఈ దేవాలయంలో ఇప్పటికీ నిత్యం దూప, దీప నైవేద్యాలు జరుగుతున్నాయి.

యమతీర్థం అని మరో పేరు!
ఇంద్రుని వాహనం అయిన ఐరావతం అనే తెల్ల ఏనుగు, యముడు ఈ స్వామిని ఆరాధించినట్లు చెబుతారు. దూర్వాసమహర్షి శాపానికి గురైన ఐరావతం రంగు మారిపోతుంది. మళ్లీ మునుపటి రంగులోకి రావాలంటే దారాసుర ఆలయంలో ఉండే పవిత్ర తీర్థంలో మునిగితే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. యమధర్మ రాజు కూడా ఓ యోగి శాపానికి గురై శాపవిమోచనం కోసం ఈ పవిత్ర జలాల్లో మునిగి శాప విముక్తి పొందాడు. అందుకే ఈ ఆలయంలో తీర్థానికి యమతీర్థం అని పేరు వచ్చింది.

శిల్పాలు అత్యద్భుతం
ద్రావిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయం శిల్పాలకు చాలా ప్రసిద్ధి. యలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలు పై చెక్కి ఉంటుంది. యలిస్ రూపం ఎలా ఉంటుందంటే దీనికి ఏనుగు యొక్క తొండం, ఎద్దు శరీరం, సింహం తల, పొట్టేలు కొమ్ములు , పంది చెవులతో వున్న రూపాన్ని కలిగివుంటుంది. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తుతో ఠీవీగా కనపడుతుంది. మండప స్థంభాలపై చెక్కిన శివకళ్యాణ దృశ్యాలు, శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ చూడొచ్చు. ఇక్కడ వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ ఇదే రహస్యం.

కుంభకోణం నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కుంభకోణం, తంజావూరు నుంచి రెగ్యులర్ రైలు సర్వీసులు ఉన్నాయి. దారాసురానికి సమీప విమానాశ్రయం తిరుచనపల్లి. ఇక్కడ నుండి దారాసురం వరకు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి అయితే దరాసురానికి ఐదున్నర గంటలు పడుతుంది.