స్త్రీలతో గర్భ సంబంధిత సమస్యలు తొలగించే ఆలయం ఇది!

పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ‘తిరుక్కరుగావూర్’ ఒకటి. తమిళనాడు తంజావూరులో పాపనాశనం తాలూక పరిథిలో ఈ క్షేత్రం వెలుగుతోంది. ఇక్కడి స్వామిని ముల్లైవనాథర్ అని, అమ్మవారిని గర్భరక్షాంబిక అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలుగుతోంది.

గర్భవతులకు రక్ష-సంతానం లేనివారికి వరం
గర్భరక్షాంబికా అంటే గర్భంలో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే తల్లిగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. కేవలం గర్భవతులుకు మాత్రమే కాదు..సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ ముల్లైవనాథర్ గా కొలువై ఉన్నాడు. ముల్లైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని. ఇక్కడ స్వామి వారిని పూజిస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా నయం అవుతాయని భక్తుల నమ్మకం.

ఆలయ ప్రత్యేకతలు
ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తులో కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషితయై మెరిసిపోతుంటుంది. ఎవరైనా తెలిసి కానీ, తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇదొకటి. ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో చేసింది. అందుకే ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అలాగే ఈ క్షేత్రానికి మాధవీ క్షేత్రం అని కూడా పేరు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు అని అర్థం. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే..ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు శివలింగం మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి.

స్థల పురాణం
ఈ ఆలయంలో కనీసం వేయి సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆలయంలో తొమ్మిదవ శతాబ్ధంలో చోళ రాజుల హయాంలో చెక్కిన శిలా ఫలకాలున్నాయి. ఈ క్షేత్రం మహిమను అప్పార్, సుందరార్, జ్ఝాన సంబంధార్ అనే ముగ్గురూ ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యాలలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ముగ్గురు నాయనార్లు ఈ క్షేత్రంలో ఆయల దర్శనానికి వస్తున్న సమయంలో దారి కనపడకపోతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరికి ఆలయ దర్శనం చేయించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఎళ్ళుగా పిల్లలు లేని వారు కూడా గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్ళకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లికాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే వివాహం జరుగుతుందని విశ్వాసం.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.