భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. అక్కడ స్వామి అమ్మవార్లని నేరుగా దర్శించుకుని ఆ ఫలితాన్ని అనుభవిస్తే కానీ నమ్మలేం. అలాంటి ఆలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రం నామక్కల్ లో ఉంది.
శ్లోకం
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!
తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడించి ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అందుకే ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు వేసేందుకు ప్రయత్నించినా కూలిపోయేదని చెబుతారు స్థానికులు. నిత్యం వేల సంఖ్యలో బక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారి కరుణ ఉంటే శత్రుశేషం,గ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుంచి రక్షిస్తుందని చెబుతారు.
నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్ధంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ ఉంటుంది. ఈ కోటకు నైరుతి భాగంలో మొట్లు ఉన్నాయి. నామగిరి హిల్స్‌కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి, రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. కొండరాయితో చెక్కిన విగ్రహాలు కావటంతో నేటికి అవి చెక్క చెదరకుండా ఉన్నాయి. ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి. ఈ దుర్గంలో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకున్నాడని చెపుతారు. తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నారట. స్వామికి ఏటా మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఈ స్వామి కరుణ ప్రసరించిన వారిపై శత్రుశేషం, గ్రహ దోషం ఉండదని విశ్వాసం.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.