ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్ లో కొలువైన తనోట్ మాత. పాకిస్తాన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలం అయిన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది..
తనోట్ మాత ఆలయం..భారతదేశంలోని పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో వుంది. జైసల్మేర్ నగరానికి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో అధిక సగటు విండ్స్పీడ్ ఉంది. తానోట్ రహదారి చుట్టూ ఇసుక దిబ్బలు, ఇసుక పర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు 49 ° C వరకు ఉండవచ్చు. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తానోట్ మాతను ఈ ఒక్క రూపంలోనే కాకుండా హింగ్లాజ్ మాతా, కర్నిమాత రూపాలలో కూడా కొలుస్తారు. ఇండో-పాక్ సరిహద్దులో ఉండే ఈ ఆలయాన్ని చూడాలనుకునే పర్యాటకులు దీనికి సంబంధించిన పత్రాలను జిల్లా, సైనిక అధికారుల నుంచి అనుమతి పత్రాలు ముందుగానే పొందాలి. పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ నిల్వలు ఉన్నాయంటారు.
రక్షణ దళాలకు తనోట్ మాత రక్ష
అమ్మవారి ఆలయాన్ని భారత రక్షణదళాలు పర్యవేక్షిస్తుంటాయి. 1965, 1971 పాక్తో జరిగిన యుద్ధాల్లో అమ్మవారి ప్రభావంతో పాక్పై విజయం సాధించినట్టు స్థానికులు చెబుతారు. 1965లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ బలగాలతో చుట్టు ముట్టుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారత సైనికులపై పాక్ ఏకంగా 3 వేల బాంబులను ప్రయోగించింది. అయితే ఒక్క బాంబు కూడా పేలకపోవడం అమ్మవారి అద్భుతశక్తికి నిదర్శనమంటారు. అప్పటి నుంచి తనోట్ మాతపై మరింత విశ్వాసం పెరిగింది..అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాజపుత్ర వంశస్థుల పూజలు
13 శతాబ్ధాల క్రితమే రాజపుత్ర వంశానికి చెందిన తానురావు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ ఆ వంశస్థులు ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 1971 యుద్ధం అనంతరం ఆలయాన్ని సరిహద్దు భద్రతాదళం నిర్వహణలోకి వెళ్లింది. ఆలయాన్ని మరింతగా విస్తరించారు. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించారు. పాక్పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ పాక్ ప్రయోగించి మూడు వేల బాంబుల్లో పేలని బాంబులను సేకరించి అక్కడి మ్యూజియంలో భద్రపరిచారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా లేనప్పుడు అంటే నవంబర్ నుంచి జనవరి నెలల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.