కేరళ రాజధాని తిరువనంతపురం లోక్ సభాస్థానం ఇప్పుడు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సారి అక్కడ ఎవరు గెలుస్తారన్నది పెద్ద ప్రశ్నే అవుతున్నప్పటికీ బీజేపీ అభ్యర్థి అయిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విజయం ఖాయమని బీజేపీ చెప్పుకుంటోంది. ఎన్నికల సర్వేలు కూడా ఆ దిశగా సంకేతాలివ్వడంతో బీజేపీలో జోష్ పెరిగింది.
రికార్డు కోసం శశి థరూర్ ప్రయత్నం
ఎవరికీ అర్థం కాకుండా ఇంగ్లీష్ మాట్లాడతారన్న పేరున్న మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ నాలుగో సారి కాంగ్రెస్ అభ్యర్థిగా తిరువనంతపురం బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని థరూర్ చెప్పుకుంటున్నప్పటికీ అది నిజం కాదని క్షేత్రస్థాయి పరిస్తితులు చెబుతున్నాయి..తిరువనంతపురంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన రికార్డు ఎవరికీ లేదు. కాంగ్రెస్ నాయకుడు ఏ. చార్లెస్ 1984,1989,1991లో వరుసగా మూడు సార్లు గెలిచినప్పటికీ 1996లో ఘోరపరాజయం పాలయ్యారు. అదే సెంటిమెంట్ ఇప్పుడు థరూర్ పై పనిచేసి ఆయన ఓడిపోతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే సొంత సెంటిమెంటును పండించేందుకు థరూర్ ప్రయత్నిస్తున్నారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలని ఈ సారి గెలిపిస్తే ఐదేళ్లు ప్రజాసేవ చేసుకుని రిటైరవుతానని థరూర్ చెబుతున్నారు….
విజయావకాశాలపై బీజేపీ ధీమా..
బీజేపీ వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కు రాజ్యసభ కంటిన్యూ చేయకుండా లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టింది. తాజా సర్వేల ప్రకారం కేరళలో బీజేపీ గెలవబోయే రెండు మూడు లోక్ సభా స్థానాల్లో తిరువనంతపురం కూడా ఉంటుందని చెబుతున్నారు. 2014లో థరూర్ తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థి అయిన మాజీ కేంద్ర మంత్రి ఓ. రాజగోపాల్ ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. థరూర్ కేవలం 14 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గంలో బీజేపీ డిలా పడినప్పటికీ ఈ సారి బాగా పుంజుకుందని చెబుతున్నారు. స్టార్ క్యాండేట్ రాజీవ్ చంద్రశేఖర్ ను నిలబెట్టడం ద్వారా పోటీ తీరును కూడా మార్చేసింది. కేంద్రప్రభుత్వంలో చంద్రశేఖర్ నిర్వహిస్తున్న కీలక బాధ్యతలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్, పెట్టుబడుల శాఖా మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ సేవలను విద్యాధికులైన కేరళ ఓటర్లు గుర్తించారని బీజేపీ విశ్లేషించుకుంటోంది.ప్రస్తుత ఎంపీ థరూర్ ఉదాసీనత కూడా తమకు ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి…
ఊపందుకున్న ప్రచారం
తిరువనంతపురం లోక్ సభా పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కళకొట్టం, వట్టియూర్కవు, తిరువనంతపురం, నేమోన్, ప్రసల్లా, కోవలం, నెయట్టిన్ కారాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ బహుముఖ వ్యూహంతో ప్రచారం చేస్తోంది. పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఉత్తేజ పరిచి ఇంటింటి ప్రచారానికి పంపుతోంది. పైగా సోషల్ మీడియా ప్రచారంలోనూ ఆ పార్టీ బాగా ముందుందనే చెప్పాలి. ఎలక్షన్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేసి జనంలో పార్టీ విధానాలను, అభ్యర్థి గుణగణాలను వివరిస్తోంది. సీపీఐ తరపున పన్నయన్ రవీంద్రన్ బరిలోకి దించుతున్నప్పటికీ.. గత రెండు ఎన్నికలను చూస్తే ఆ పార్టీకి గెలిచే సీన్ లేదని తేలిపోయింది….