సిక్కుల ఊచకోతకు వాళ్లే కారణం – కాంగ్రెస్ గ్రూపుపై మోదీ ఆగ్రహం

లోక్ సభ ఎన్నికలు దాదాపుగా తుది దశకు చేరుకుంటున్నాయి. మిగిలిన స్థానాల్లో పాగా వేసేందుకు పార్టీలు తమ వ్యూహరచనలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాది సహా ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడో ముగిసి పోవడంతో ఆ రెండు రాష్ట్రాలపై ప్రధాని మోదీ స్వయంగా ఏకాగ్రత చూపుతున్నారు.అక్కడి లోక్ సభా స్థానాల్లో వంద శాతం విజయం సాధించాలని ఆయన లెక్కలేసుకుంటున్నారు…

ద్వారకాలో మోదీ ప్రచారం….

ఢిల్లీలోని ఏడు లోక్ సభా స్తానాలకు ఈ నెల 25న పోలింగ్ జరుగుతుంది. అక్కడి ద్వారకా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పై ప్రత్యక్షంగానూ, ఇండియా గ్రూపుపై పరోక్షంగానూ విమర్శలు సంధించారు. సిక్కులపై ఎక్కడ ఊచకోత జరిగినా దానికి కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలే కారణమని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో సిక్కు సోదరుల మెడకు టైర్లు తగిలించి తగులబెట్టారని ఆనాటి సంఘటనలను మోదీ గుర్తుచేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన హింసాకాండను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ గొడుగు కింద నిల్చున్న ప్రతీ పార్టీ ఆ ఘటనలకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆనాటి ఆటవిక దృశ్యాలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయని అంటూ… అప్పటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదన్నారు..

కుటుంబం కాదు.. జాతి ముఖ్యం…

కాంగ్రెస్ కుటుంబ పాలనను మోదీ మరో సారి గుర్తు చేశారు. ఆ పార్టీకి ప్రజల కంటే సోనియా కుటుంబమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి దేశం మొదటి వరుసలో ఉంటుందని, కాంగ్రెస్ కు కుటుంబమే నెంబరన్ వన్ అజెండా అని మోదీ అటాక్ చేశారు. కేవలం బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయని ఆ రెండు పార్టీలకు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదని మోదీ ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ ఏడు స్థానాల్లోనూ తమదే విజయమని ఆయన చెప్పారు.

పంజాబ్ పర్యటనకు ప్రధాని

పంజాబ్ లో రెండు రోజుల ఎన్నికల ప్రచార పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ..ప్రస్తుతం పంజాబ్ బీజేపీ ఇంచార్జీగా ఉన్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లన్నీ ఆయన చూశారు. పటియాలా, జలంధర్, గుర్దాస్పూర్ లో మోదీ ర్యాలీలు ఉంటాయి. అకాలీదళ్ తో పొత్తు లేకుండా బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో రైతుల సమస్యలు, సిక్కుల ఊచకోత అంశాలు మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు.పంజాబ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేళ్లను గుర్తుచేస్తారు. 2022లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ ని ఫీరోజ్ పూర్ ఫ్లైవోవర్ పై కొందరు ఆపారు. ఈ సారి ఆ పరిస్థితి రాకుండా భద్రతా దళాలు చూసుకుంటున్నాయి….