ఆంజనేయుడు, బలి చక్రవర్తి సహా వీళ్లు ఇప్పటికీ బతికే ఉన్నారు!

చిరంజీవులు అంటే మరణం లేనివారని అర్థం. అలాంటివారు మన పురాణాల్లో ఏడుగురు ఉన్నారు. అశ్వత్థాముడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు…ఈ ఏడుగురు సప్తచిరంజీవులుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీళ్లు ఎందుకు చిరంజీవులయ్యారో తెలుసుకుందాం…

వ్వాసమహర్షి
సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు.

హనుమంతుడు
భక్తుడైన హనుమంతుడికి శ్రీ రాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ అందుకు అంగీకరించడు. తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు. అలా శ్రీరాముడి వరంవల్లే హనుమంతుడు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని భక్తుల విశ్వాసం. హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని, కొంత మంది చూశారని చెబుతుంటారు.

బలిచక్రవర్తి
బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. దేవాంబ- విరోచనుల తనయుడు. రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలున్నాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి, స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు. ఒకసారి విష్ణుమూర్తిని తూలనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో….ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు. చివరకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి మూడు అడుగుల నేలను దానం కోరతాడు. భూమిపై, ఆకాశంపై రెండు అడుగులు వేసి మూడో అడుగు బలి తలపై మోపి పాతాళానికి పంపిస్తాడు.

అశ్వత్థామ
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా వీరులందరూ దాదాపుగా మరణించారు. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. ఎలాగైన ప్రభువు రుణం తీర్చుకుంటానంటూ శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేశాడు. దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వత్థాముడిని చంపేందుకు కత్తి దూయగా ద్రౌపది అడ్డుకుంటుంది. మరి తన ప్రతిజ్ఞ సంగతేంటన్న అర్జునుడితో….గుండు చేసి వదిలెయమని చెబుతుంది. నువ్వు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి చావుకోసం ఎదురు చూస్తూ ఇలాగే జీవిస్తావని శపించాడు అర్జునుడు.

విభీషణుడు
రాక్షస వంశంలో పుట్టినా ధర్మజ్ఞుడన్న శాశ్వత కీర్తిపొందాడు విభీషణుడు. ఆయన సర్వజ్ఞుడు. విశ్రావసుడు కైకసీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని. రావణునికి తమ్మునిగానేగాక, సలహాదారునిగానూ తన తెలివి తేటలు ప్రదర్శించాడు. రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు చిరంజీవి అయ్యాడు.

కృపాచార్యుడు
శరద్వంత మహర్షికి-అప్సరసకు జన్మించిన కుమారుడే కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షాన నిలిచి యుద్ధం చేశాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.

పరశురాముడు
రేణుకా జమదగ్నుల కుమారుడు పరశురాముడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు .శివుని ఆజ్ఞతో తీర్ధయాత్రలు చేసిన పరశురాముడు…శివానుగ్రహంతో భార్ఘవాస్త్రము పొందాడు. విష్ణుమూర్తి దశావతారములలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు.

ఈ ఏడుగురితో పాటూ, శివానుగ్రహంతో కల్పంజయుడైన మార్కండేయుడిని నిత్యం స్మరించుకుంటే సర్వవ్యాధులనుంచి ఉపశమనం పొందుతారని శాస్త్రవనచనం.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం