శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే!!
ఆదిపురుష్ సినిమా విడుదల సందర్భంగా మళ్లీ రామాయణంపై అందరి మరింత శ్రద్ధ పెరిగింది. అయితే రామాయణం చదవడం, సినిమాల్లో చూసి భక్తితో ఊగిపోవడం కాదు ఆ రామచంద్రుడి నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ మార్గంలో నడవాలంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటారు పండితులు.
ఓ సందర్భంలో నారదుడిని వాల్మీకి మహర్షి ఇలా అడిగారట
వాల్మీకి
నిత్యం సత్యం పలికే వాడు నిరతము ధర్మం నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు సూర్యునివలనే వెలిగే వాడు
ఎల్లరికి చలచల్లని వాడు ఎదనిండా దయగల వాడు…
సరియగునడవడివాడు…ఈ లోకంలో అని..
నారదుడు
ఈ ప్రశ్నలన్నింటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు
ఓం కారానికి సరి జోడు జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవుల నెలరేడు మాటకు నిలబడు ఇలరేడు..
దశరధ తనయుడు దానవ దమనుడు జానకిరాముడు…
అతడే శ్రీరాముడు శ్రీరాముడు అని సమాధానమిచ్చాడు నారద మహర్షి
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. శ్రీ మహావిష్ణువు మానవరూపంలో భూమిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో16 గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.
- గుణవంతుడు 2. వీర్యవంతుడు 3. ధర్మాత్ముడు 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు 5. సత్యం పలికేవాడు 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు 7. వేద వేదాంతాలను తెలిసివాడు 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు 9. విద్యావంతుడు 10. సమర్థుడు 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు 12. ధైర్యవంతుడు 13. క్రోధాన్ని జయించినవాడు 14. తేజస్సు కలిగినవాడు 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు
- అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు
అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారంలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించలేదు..అదే కృష్ణావతారంలో మాత్రం తానే భగవంతుడిని అని చెబుతాడు.
“రామస్య ఆయనం రామాయణం”
రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే…ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .