భారతీయ పురాణ కథల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొందరికి గోత్ర రూపంలో రుషులను స్మరించుకుంటుంటే..మరికొందరికి వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు. అయితే ఎంతమంది రుషులు ఉన్నా సప్తరుషులు ప్రత్యేకం.
కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!
కశ్యపుడు
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు. కశ్యపుడి సంతానం ఎవరంటే..దైత్యులు, ఆదిత్యులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష- లతా జాతులు, మృగాలు, సర్పాలు, గోగణాలు, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షి
అత్రి
సప్తర్షుల్లో రెండోవాడు అత్రి మహర్షి. బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు అత్రి. భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు
భరద్వాజ
ఉతథ్యుడు-మమత కుమారుడు భరద్వాజ మహర్షి. బృహస్పతి కృప వల్ల జన్మించి, ఘృతాచీపై మనసు పడి ద్రోణుడి జన్మకు కారకుడవుతాడు.
విశ్వామిత్ర
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, మేనక వల్ల తపోభంగం జరిగి మరికొంత ఫలాన్ని పోగొట్టుకుంటాడు. విశ్వామిత్రుడు-మేనకి జన్మించిన పుత్రికే శకుంతల. దుష్యంతుడు, శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
గౌతమ మహర్షి
తీవ్ర కరువు ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చాడు గౌతముడు. తన భార్య అహల్యను శిలగా మారమని శాపమిచ్చింది గౌతముడే.
వశిష్ఠ మహర్షి
విశిష్ఠుడి భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాల సప్తర్షుల్లో ఒకడు. దక్ష ప్రజాపతి కుమార్తె ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
జమదగ్ని మహర్షి
రుచికముని, సత్యవతుల కుమారుడు జమదగ్ని మహర్షి. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహానికి లోనైందని తెలిసి ఆమెను తన కొడుకైన పరశురామునితో నరికించేస్తాడు. ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను మళ్లీ బతికించాడు జమదగ్ని.