జీవితకాలంలో తీర్చుకోవాల్సిన ఐదు రుణాలు ఇవే!

నిత్యం భోజనం చేసేటప్పుడు చాలామంది నమస్కరిస్తారు..యజ్ఞోపవీతం ధరించిన వాళ్లు ఆకు చుట్టూ లేదంటే పళ్లెం చుట్టూ చేయి తిప్పి ఆహార పదార్థాలపై నీళ్లు చల్లుతారు. ఇంకొందరు ఓ ముద్ద తీసి పక్కపెట్టిన తర్వాత తినడం ప్రారంభిస్తారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీర్చుకోవాల్సిన రుణాలకు సంకేతం ఇదే… ఇంతకీ ఏంటా రుణాలు..

దేవ ఋణం
మనిషిగా జన్మనిచ్చినందుకు..మనల్ని అనుక్షణం కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞత తెలిపేదే దేవరుణం

పితృ ఋణం
మనకు, మన వంశానికి…సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించిందీ వాటిని పాటించేలా చేసిన పితృదేవతలకు కృతజ్ఞత తెలిపేదే పితృరుణం

ఋషి ఋణం
ఇప్పుడు అనుసరిస్తున్న ధర్మాన్ని, సంస్కృతినీ మనకు అందించినవారే ఋషులు.. వారి రుణం తీర్చుకోవడమే ఋషి ఋణం

మనుష్య ఋణం
మనం, మన తోటివాళ్ళు కలిస్తేనే సమాజం. తోటి వ్యక్తుల సహాయ సహకారాలు లేకుండా మనం జీవించలేం. అందుకే మనుష్య ఋణం తీర్చుకోవాలి.

భూత ఋణం
మనలోనే అయిదు ప్రాణశక్తులుగా నిలిచే భగవంతునికి ఆహారాన్ని నివేదించాలి. ‘ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా’ అంటూ శరీరంలోని అయిదు శారీరక విధులకూ ప్రాణశక్తిగా నిలుస్తున్న దేవుణ్ణి కొలవాలి. శ్వాస (ప్రాణ), విసర్జక (అపాన), ప్రసారక (వ్యాన), జీర్ణ (సమాన), ఉదాన వ్యవస్థలు అయిదింటికీ ఆధార భూతుడైన భగవంతుణ్ణి ప్రార్థించాలి.

అందుకే చాలామంది ‘భగవద్గీత’లోని ఈ శ్లోకాలను భోజనం చేసే ముందు పఠిస్తారు

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥

హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోత బ్రహ్మము, హవన క్రియ బ్రహ్మము, కర్మలో బ్రహ్మ భావం గల ఆ పురుషుడు పొందదగిన ఫలం కూడా బ్రహ్మమే!’ అని భావం.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥

‘నేను జఠరాగ్ని రూపంలో ప్రాణుల దేహాన్ని సమాశ్ర యించి, ప్రాణ, అపాన వాయువులతో కూడి, వారు భుజించే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములనే నాలుగు విధాలైన ఆహారాలనూ పచనం చేస్తున్నాను’ అని సాక్షాత్తూ భగవానుడు పేర్కొన్నాడు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకే తినేటప్పుడు అన్నాన్ని అసహ్యించుకోకూడదు. నిందించకూడదు. అన్నం తిని ఎంగిలి కడుగోకుండా అగ్ని, గోవును ముట్టుకోకూడదు. సూర్య చంద్రులనూ, నక్షత్రాలనూ చూడకూడదని మన ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.