గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగేందుకు సింపిల్ టిప్స్ ఇవి!

మొక్కలు పెంచే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరికి అవో కాలక్షేపం అయితే మరికొందరి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఓ వ్యాపకం. అయితే పెంచే మొక్కలన్నీ పూలు, పండ్లతో కళకళలాడితే మనసుకి కలిగే ఆనందమే వేరు. ముఖ్యంగా మొక్కలు పెంచే ప్రతి ఇంట్లో గులాబీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ మొక్క పుష్టిగా ఉండేందుకు నిండుగా పూలు పూసేందుకు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి

గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఇలా చేయాలి
మీరు గులాబీ మొక్కను కొనేటప్పుడు వాటికి ఆల్రెడీ పూలు ఉంటే వాటిని తీసి వేయండి. అప్పుడు కొమ్మలు మాత్రమే పెరిగి గులాబీ మొగ్గలు వస్తాయి. అందుకే కొనేటప్పుడు ఏమైనా పూలుంటే వాటిని తీసేయండి. గులాబీ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం కొంటున్నామో ముందుగా చూసుకోవాలి. మొక్కను వెలుతురు ఉండే ప్రదేశంలో పెట్టాలి. అందం కోసం అని ఆలోచించి రోజుకో ప్లేస్ మార్చొద్దు. దీనికి మంచి కంపోస్ట్ రిచ్ మట్టిని వాడాలి. కనీసం రెండు అడుగుల లోతులో గులాబీ మొక్కలు నాటాలి. గులాబీ మొక్కకు తరచూ నీళ్లు పోయాలి. ఆ నీరు ఆకులపై పడకుండా జాగ్రత్తపడాలి. మట్టితో పాటూ వేప పొడిని కలపి మొక్క నాటితే పురుగులు పట్టకుండా ఉంటుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు రాలే పూలను తీసేయాలి. అప్పుడే కొత్త పూలు పూస్తాయి. గులాబీలు సాధారణంగా సంతకాలం నుంచి శరదృతువు వరకు వికసిస్తాయి. గులాబీ మొక్కలకి బయట దొరికే పురుగు మందులు బదులు ఇంట్లోనే కొన్ని సహజ క్రిమి సంహారకాలు తయారు చేయొచ్చు. అందుకోసం వేపాకులు తీసుకుని అందులో వెల్లుల్లి తొక్క వేసి మొత్తగా మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో వేయాలి. దీనిని స్ప్రే చేస్తుంటే చీడపీడలు, కీటకాలు, చీమలు వదులుతాయి.

శీతాకాలం, వానాకాలంలో గులాబీలకు సూర్యరశ్మి చాలా అవసరం. ఉదయం వేళ ఒక గంట పాటు గులాబీకి గోరువెచ్చని సూర్యకాంతి తగిలేలా ఉంచండి. ఇది గులాబీని వికసించేలా చేస్తుంది, కానీ మండే ఎండలో గులాబీని ఉంచవద్దు. గులాబీ మొక్కలు పెంచేందుకు ఎక్కువ శ్రమ అసవసరం లేదు, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కేవలం గులాబీ మొక్కలకే కాదు అన్ని మొక్కలకూ ఇదే పద్ధతి అవలంభించవచ్చు. ఇంట్లో మొక్కలుంటే అందం ఆనందం. పూల సువాసన ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.