శ్రీరాముడి క్షేత్రాల్లో ఈ 25 చాలా ప్రసిద్ధి!

రామో విగ్రహవాన్‌ ధర్మః..అంటే ‘ధర్మం విగ్రహ రూపంలో అంటే రాముని రూపంలో ఉంది’ అని అర్థం. త్రేతా యుగంలో ఆదర్శ మానవ జీవితాన్ని గడిపి సామాన్య వ్యక్తిగా అసామాన్య ప్రజ్ఞ చూపించిన మహావ్యక్తి శ్రీరాముడు. అంత పరాక్రమవంతుడు, ధర్మపరాయణుడు, తన రాజ్యంలో ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టిన శ్రీరాముడు ‘రామం దశరధాత్మజం’ అంటే ‘నేను కేవలం దశరధ మహారాజు కుమారుణ్ణి’ అని చెప్పుకుంటాడు.

స్నేహం దయాం చ సౌఖ్యం చ
యదిరాజోన కీమపి ` ఆరాధనాయ లోకస్య
మంచతే నాస్తి మేవ్యధాః

అంటే మానవజన్మలోని ముఖ్య ధర్మం లోక కల్యాణం. ధర్మాచరణలో స్నేహం, దయ, సుఖం కోరుకోరాదు. ధర్మాచరణ కోసం తాను అత్యంత ప్రేమించే తన భార్య జానకిని విడువడంలో సైతం కించిత్‌ వ్యధ చెందను అంటాడు శ్రీరాముడు. ధర్మాచరణలో అంత గొప్ప సంక్పల్పం కలవాడు. అందుకే రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నారు పండితులు. అంటే రాముడు విగ్రహ రూపంలో ఉన్న ధర్మం వంటివాడు. అంటే ధర్మానికి రూపం అని అర్థం.

అందుకే సీతారాముల ఆలయం లేని ఊరు కనిపించదు. ప్రతి గ్రామంలోను నిత్యపూజలు అందుకుంటాడు శ్రీరాముడు. అయితే సీతారాములు కొలువైన పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు 25 వరకూ ఉన్నాయని ఆధ్యాత్మిక గంథాలు చెబుతున్నాయి.

25 క్షేత్రాలు
అయోధ్య, మిథిల, భద్రగిరి, రామతీర్థం, ఒంటిమిట్ట, గోదావరి తీర్థం, నాసిక్, పంచవటి, రామగిరి, లక్ష్మణపురం, గంధమాదనం , పంపాతీరం, కిష్కింద, యమునా తీరం , చిత్రకూటం , పర్ణశాల, నంది గ్రామం, హంపి, జీడికల్లు, తిరువళ్లూరు, తిరుపతి, మధురాంతకం, శ్రీరంగం , దర్భశయనం , తిరుప్పల్ నొడి. ఈ క్షేత్రాల్లో శ్రీ రాముడిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యం అని విశ్వశిస్తారు హిందువులు.

“శరీరస్య గుణానాం చ, దూరమత్యంత మంతరం
శరీరం క్షణవిధ్యంసి, కల్పాంతస్థాయినో గుణాః”

శరీరానికి, గుణానికి చాలా భేదం ఉంది. శరీరం ఏక్షణంలోనైనా పతనమౌతుంది కాని సృష్టి చివరి వరకు నిలిచి ఉండేది వ్యక్తి గుణం మాత్రమే. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, వివేకానందుల శరీరాలు ఇప్పుడు లేవు. కాని వారి గుణాలు శాశ్వతం. అందుకే శరీరం కోసం జీవించడం కాదు. లోకకళ్యాణం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి. ఈ శరీరాన్ని ఉపయోగించి లోకకల్యాణ కారకమైన సద్గుణాలను సంపాదించుకోవాలి. మనం విగ్రహారాధకులం మాత్రమే కాదు, గుణారాధకులం అని చాటిచెప్పాలి.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.