హిందువులంటే మీరేనా? మేం కాదా!
సీఎం ఎక్కడా, ఎప్పుడూ ఎవరినీ అగౌరవ పరచలేదు..
బీజేపీ పూర్తిగా దిగజారి వక్రీకరిస్తోంది
హిందుత్వం మీ పేటెంటా?
మానవత్వమే దైవత్వం అని చెబితే తప్పేంటి?
నాడు బాబు 40 గుడులు కూల్చితే మాట్లాడలేదేం?
-వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన అని చెబుతూ.. మా పార్టీ అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది.
రాష్ట్ర ప్రజలందరికీ శివయ్య చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పింది.
ఇందులో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బ తిన్నాయో అర్థం కావడం లేదు.
ఆ ట్వీట్‌లో పరమ శివుడిని కించ పర్చినట్లు ఎక్కడ ఉందో చెప్పండి? బీజేపీ పూర్తిగా దిగజారి వక్రీకరిస్తోంది.
శివరాత్రి రోజు బీజేపీ వాళ్లు శివాలయాలకు వెళ్లడం మర్చిపోయినట్లు ఉన్నారు.
అందుకే ఈరోజు కోవెలకు వెళ్దాం అంటూ ధర్నాలు చేపట్టారు’ అని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.
ఈ విషయమై ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హిందుత్వానికి మీరు పేటెంటా?
మతాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? హిందుత్వంపై బీజేపీకి పేటెంట్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మీకన్నా హిందుత్వంపై ఎక్కువ ప్రేమ ఉన్నవారు, హిందూ సంప్రదాయాలు పాటించే వారు వైఎస్సార్‌సీపీలో కోట్లాది మంది ఉన్నారు. బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ ట్వీట్ ఇన్సల్టింగ్‌గా ఉంది.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి
మత రాజకీయం
ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఆయన ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలుస్తున్నారు. దాన్ని ఫొటో రూపంలో ఒక అభిమాని చిత్రించాడు. పెత్తందారులైన బీజేపీ నాయకులు దాన్ని మత రాజకీయాలకు వాడుకోవడం దారుణం. అసలు ఇది మానవత్వమేనా?
– కొడాలి నాని, మాజీ మంత్రి
ఇందులో తప్పేముంది?
రాష్ట్రంలో బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. మేమంతా హిందువులమే. ఆ ట్వీట్ ద్వారా మా మనోభావాలు ఏమీ దెబ్బతిన లేదు. బీజేపీ వాళ్లకు ఏం ఇబ్బంది కలిగిందో మాకు అర్థం కావటం లేదు. ఆకలి అంటే దేవుడిని తలుచుకోవడం అందరికీ సహజం. రాష్ట్రంలో మనుగడ కోసం ఏమీ లేని చోట బీజేపీ మసిపూసి మారిడికాయ చేస్తోంది. గతంలో వారే దేవాలయాలు కూల్పించి వారే ధర్నాలు, నిరసనలు చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ విమర్శలను ఏకకంఠంతో ఖండిస్తున్నాం.
– బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి
నాడు గుడులు కూల్చినప్పుడు ఏమయ్యారు?
హిందూ మతాన్ని, దేవుళ్లను రాజకీయంగా వాడుకోవడం బీజేపీకి ఒక క్రీడగా మారింది. మతానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే. సీఎం జగన్ సూచనల మేరకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో రాష్ట్రమంతా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న తరుణంలో ఓ సదుద్దేశంతో ట్విట్టర్లో వచ్చిన ఒక చిన్న క్యారికేచర్‌ను పట్టుకుని వక్రభాష్యాలు వల్లిస్తూ రెచ్చిపోవడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు టీడీపీతో అంటకాగినప్పుడు రాష్ట్రంలో 40 గుళ్లు కూల్చారు. అప్పుడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత, ఇతర నేతలంతా ఎక్కడ నిద్రపోయారు? టీడీపీ కూల్చితే మేం పునరుద్ధరించాం. ఆకాశంపై ఉమ్మితే ఏమవుతుందో తెలుసుకోండి.
– కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ)