మన దేశంలో ఉన్న ప్రతి ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. కొన్ని అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోతే మరికొన్ని ఆలయాలు కొన్ని విశిష్టతల కారణంగా ధూప దీపాలతో వెలుగుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రం పుదుకోట్టాయ్ లో ఉన్న ఆలయం…
గర్భగుడిలో విగ్రహం లేదు
గర్భగుడి అంటేనే మూలవిరాట్ విగ్రహం కొలువైఉంటుంది. దానిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. అయితే గర్భగుడిలో ఎలాంటి విగ్రహం లేకుండా పూజలందించే ఆలయం చూడాలంటే తమిళనాడు వెళ్లాల్సిందే. పుదుకోట్టాయ్ లో ఉన్న ఈ వింత ఆలయాన్ని అవుడయర్ కోయిల్ అంటారు. ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామిగా భక్తులు పూజిస్తారు. అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహం మన కంటికి కనిపించదు. అయినప్పటికీ ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శరీరంలోని ఆత్మ ఏవిధంగా అయితే కనిపించదో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారు కూడా భక్తులకు కనిపించరు. మన శరీరంలోని ఆత్మ మన కంటికి కనిపించదని మన ఆత్మని మనం విశ్వసించకుండా ఉండలేము కదా… అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం లేదని, అక్కడ పూజలు చేయడం మానలేదు భక్తులు…
యోగంబాల్ అమ్మవారు
గర్భగుడిలో శివలింగం…ఎదురుగా నంది, ధ్వజస్తంభం ఉంటుంది కానీ…ఈ ఆలయంలో అవేమీ ఉండవు. ఇక్కడ అమ్మవారిని యోగంబాల్ అని పిలుస్తారు. అయితే ఈ అమ్మవారు కూడా మనకు కనిపించరు. మరో విశిష్టత ఏంటంటే శివాలయంలో నవగ్రహాలు మండపంలో ఉంటాయి కానీ ఇక్కడ ఆలయంలో స్తంభాలపై నవగ్రహాలు చెక్కి కనిపిస్తాయి.ఎ క్కడా లేని విధంగా 27 నక్షత్రాలకి విగ్రహరూపాలని కూడా ఇక్కడి ఆలయంలో మనం చూడచ్చు.
మొత్తంగా చెప్పుకోవాలంటే గర్భగుడిలో ఏమీ ఉండదు కానీ శివుడు, పార్వతి కొలువై ఉన్నారనే విశ్వాశంతో పూజలు చేస్తారు భక్తులు. పైగా వేడి వేడి నైవేద్యం సమర్పించి …దానిపైనుంచి వచ్చే ఆవిరిని దైవంగా భావిస్తారు. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..