బిర్యానీలో ఇన్ని వెరైటీలా..మీరెన్ని రుచి చూశారు!

బిర్యానీ…ఈ మాట వింటేనే నోరూరిపోతుంది.ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ ఈ రుచిని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ అంటే ఆ టేస్టే వేరు. ఈ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అనుకోనివారుండరు. అయితే బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. ఆ వెరైటీస్ గురించి మీకోసం..

అచారి బిర్యాని
ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బిర్యానీ చాలా ఫేమస్. దీని రుచిలో అచారి మసాలాదే స్పెషల్ రోల్. అచారీ మసాలా అంటే ఏంటంటే..ఆవాలు, మెంతులు, వాము, ఎండు మామిడి పొడి, నల్ల జీలకర్ర గింజలు, అజ్వాన్, ఇంగువతో తయారు చేస్తారు. బిర్యానీ తయారీకి ఈ మసాలాను వినియోగిస్తారు.

జోధ్ పురి బిర్యాని
ఈ బిర్యాని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇది పూర్తి శాఖాహార బిర్యాని. రకరకాల కూరగాయలను మిక్స్ చేసి ఫైనల్ టచ్ కోసం డ్రై ఫ్రూట్స్ జోడిస్తారు. నాన్ వెజ్ అలవాటు పడిన నోటికి ఇది పెద్దగా రుచించకపోవచ్చు కానీ ఆరోగ్యానికి చాలామంచిది.

మొఘల్ బిర్యానీ
మొఘలుల రాకతో ఈ బిర్యానీ మన దేశానికి పరిచయం అయ్యింది. వాస్తవానికి అసలు సిసలు బిర్యానీ అంటే ఇదే. అంటే బిర్యానీలు అన్నింటికీ మూలం మోఘల్ బిర్యానీ. మొఘలుల కాలంలో దర్బారులో ఉన్న వంటవారంతా…మహారాజు కోసం ప్రత్యేక వంటకాలు చేసేవారు..అందులో ఒకటి ఈ బిర్యాని. మాంసం,మసాలా దినుసులతో పాటూ కేవరా అని పిలిచే సుగంధ భరితమైన మొక్కనుంచి తీసిన రసాయనాన్ని చల్లేవారు. ఈ వాసనకే కడుపునిండిపోయేంతలా ఉంటుందట.

మోటీ బిర్యానీ
ఇది అవధ్ రాజ్యాన్ని పాలించిన నవాబ్ వాజిద్ అలి షా తన కోసం ప్రత్యేకంగా చేయించుకునేవారట. 18వ శతాబ్ధంలో ఈయన పాలించిన ఆ రాజ్య భూభాగం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఉడకబెట్టిన గుడ్లపై తినదగిన వెండి, బంగారపు రేకులను చుట్టి ముత్యాల్లా తయారుచేస్తారు. ఆ ముత్యాల్లాంటి గుడ్లను, చికెన్, బియ్యం, మసాలా దినుసులతో కలిపి మోటీ బిర్యానీని తయారుచేసేవారు.

కోల్ కతా బిర్యాని
మిగతా బిర్యానీలతో పోలిస్తే కోల్ కతా బిర్యానీ కాస్త వెరైటీగా ఉంటుంది. ఇందులో ఉడకబెట్టిన బంగాళాదుంపలు వినయోగిస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదైనా సరే బంగాళాదుంప ఉండాల్సిందే. మాంసం రుచికి బంగాళాదుంప రుచి కూడా తోడై కొత్త రుచి తోడవుతుందంటారు కోల్ కతా బిర్యాని.

మీన్ బిర్యానీ
చికెన్ కు బదులుగా చేపతో చేసే దమ్ బిర్యానీని మీన్ బిర్యానీ అంటారు. ముఖ్యంగా కేరళలో ఇది చాలా పాపులర్. మసాలా పేస్టును దట్టించిన చేపలు, వేయించిన జీడిపప్పులు చేర్చి ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. కేరళవాసులు కొందరు ఈ బిర్యానిలో కొబ్బరి తురుము, నల్లని కొకుమ్ అనే పండు కూడా చేరుస్తారు.

కటకి బిర్యాని
ఒడిశా లో కటక్ రీజియన్ లో లభించే బిర్యాని ఇది. అందుకే దీన్ని కటకి బిర్యాని అంటారు. ఈ బిర్యాని పర్షియాలో పుట్టిందని కొంతమంది సైనికుల ద్వారా ఒడిశా చేరిందని చెబుతారు. ఇది కూడా మటన్ బిర్యానీనే.