అక్కడ కమలానికి సానూకూల పవనాలు

మధ్యప్రదేశ్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఒకే దశలో 230 నియోజకవర్గాల్లో జరుగుతోంది. మరో సారి అధికారం ఖాయమని కమలం పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు, చేసిన మంచి పనులే గెలిపిస్తాయని వారు ధీమాగా ఉన్నారు. శివరాజ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా ఉంటాయన్న విశ్వాసం వారికి ఉంది.

బీజేపీ తుపాను వచ్చేస్తోందంటున్న మోదీ…

ప్రధాని మోదీకి ఇష్టమైన రాష్ట్రాల్లో మధ్యప్రదశ్ కూడా ఒకటని చెప్పాలి. ఈ సారి అత్యధిక బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ తుపానులా దూసుకెళ్తోందని ప్రచార సభలో మోదీ ప్రకటించారు. మీటింగులకు వచ్చే జన సందోహమే అందుకు ఉదాహరణ అని మోదీ చెబుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా బీజేపీ పట్ల అభిమానంగా వస్తున్న అభిమాన జనమే తమను గెలిపిస్తారని మోదీ చెప్పుకున్నారు. ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినా జనం మీటింగు పూర్తయ్యే వరకు వేచి ఉండడంతో మోదీ సహా బీజేపీ నేతలందరూ పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. తుపాను గాలికి కాంగ్రెస్ టెంట్ తల్లకిందులు కావడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. తను మూడో సారి అధికారానికి వచ్చి దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోదీ చెప్పుకోవడం మధ్యప్రదేశ్ ప్రచారంలోనూ హైలైట్ అనే చెప్పుకోక తప్పదు.

అవినీతే ప్రధాన అజెండా..

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అవినీతి ప్రధాన అజెండాగా నిలిచింది. శివరాజ్ సింగ్ హయాంలో 250 స్కాములు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా ఒకటి కూడా నిజం కాదని, హస్తం పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని బీజేపీ బదులిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్కాములతో పుట్టిందని అంటూ అనేక ఉదంతాలిస్తోంది. దానితో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోవడమే కాకుండా జనంలో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోంది.

గెలిపించే ఐదు హామీలు

బీజేపీ తన మ్యానిఫెస్టోలో 5 ప్రధానమైన హామీలను ఇచ్చింది. విద్యుత్, గ్యాస్ సిలిండర్లతో పాటు రైతులను ఆకట్టుకునేందుకు మ్యానిఫెస్టోలో అనేక హామీలను గుప్పించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వంద రూపాయాలకే 100 యూనిట్ల విద్యుత్ ను అందించడం, ఉజ్వల యోజన, లాడ్లీబెహనా లబ్ధిదారులకు సిలిండర్ రూ.450లకే అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా లాడ్లీ బెహానా యోజనా కింద అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతి నెల రూ.1250 జమచేస్తున్నామని, దాన్ని రూ.3 వేలకు పెంచుతామని చెప్పింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొంది. రైతులనుంచి గోధుమలను క్వింటాల్ కి రూ.2700, వరిని రూ.3100 చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ.20వేల కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపింది. ఆస్పత్రులు, ఐసీయుల్లో బెడ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని చెప్పింది.ఈ హామీలన్నింటినీ జనం విశ్వసించిన నేపథ్యంలోనే బీజేపీకి విజయంపై ధీమా పెరిగింది.పైగా మోదీ నాయకత్వంపై మధ్యప్రదేశ్ ప్రజలకు విశ్వాసం ఉంది. ప్రధానమంత్రిని తమ వాడిగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తారు.