అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటున్నారు కానీ ఇప్పటికే వారంతా కలిసి అవినీతి చేస్తున్నారన్న విషయం మెల్లగా బయటకు వస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విచారించిన సమయంలో ప్రధానంగా కేసీఆర్ చుట్టూ ప్రశ్నలు సంధించినట్లుగా ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు మెల్లగా కేసీఆర్ పేరునూ బయటకు తెస్తున్నారన్న విషయం అర్థం చేసుకోవచ్చు.
గోవా, పంజాబ్‌లలో ఆప్ ఎన్నికల ఖర్చు పంపింది కేసీఆరేనా ?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఏం ప్రశ్నించారన్న విషయం అధికారికంగా బయటకు రాదు కానీ.. అనధికారికంగా మాత్రం కేజ్రీవాల్ – కేసీఆర్ బంధంపై ఆరా తీసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా పరిచయాల మధ్యలో ఆర్థిక వ్యవహారాలు ఎందుకు వచ్చాయన్న కోణంలో కేజ్రీవాల్ నుంచి వివరాలను సీబీఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. వివిధ పద్దతుల ద్వారా హైదరాబాద్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం చేరిందని అది ఎందుకు ఇచ్చారని సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెబుతున్నారు. గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తృతంగా ఖర్చు పెట్టింది. పంజాబ్‌లో అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ … ప్రధానంగా పోరాడిన బీజేపీ కన్నా ఎక్కువగా ఆప్ ఖర్చు పెట్టిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
విపక్షాలకు ఎన్నికల ఖర్చు లెక్కలు సీబీఐ బయటకు తీస్తుందా ?
ఉత్తరాది ప్రాంతీయపార్టీలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేసీఆర్ ప్రమేయం లేకుండా జరగదని… ఆయనతో ఆర్థిక సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి.,.. ఎలా కొనసాగుతున్నాయన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో సంచలనం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమెను ఈడీ ప్రశ్నించింది. కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆమె ప్రస్తుతానికి బెడ్ రెస్టులో ఉన్నారు. ఈ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ ను కూడా ప్రశ్నించి..కేసీఆర్ ప్రస్తావన తేవడంతో.. కవితతో పాటు కేసీఆర్ ప్రమేయం కూడా ఉందన్న సంకేతాలను సీబీఐ ఇచ్చిందని చెబుతున్నారు.
మొత్తం లెక్కలు బయటకు వస్తే సంచలనమేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బయటకు వచ్చింది కొంతేనని కానీ ఆ స్కాం లోతు చాలా ఎక్కువ అన్న అనుమానాలు సీబీఐ, ఈడీ దర్యాప్తుల ద్వారా వెల్లడవుతున్నాయి. ఈ స్కాం ద్వారానే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ పార్టీలు.. కాంగ్రెస్ కు కూడా ఆర్థిక సాయం చేయాలనుకున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేజ్రీవాల్ సీబీఐ విచారణ లో అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలిచ్చారో కానీ… పూర్తి ఆధారాలతోనే ప్రశ్నించి ఉంటారు. ఇప్పటికే స్కాములో అరెస్టయిన వారికి బెయిల్ కూడా లభించడం లేదు. ఆధారాలు లేకపోతే బెయిల్ రాకుండా ఉండే చాన్స్ లేదు. మొత్తంగా కేసీఆర్ … ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన పాత్ర… ఏమిటన్నది సీబీఐ త్వరలోనే బయట పెట్టే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.