పరకామణిలో చోరీలా ? టీటీడీ పూర్తిగా విఫలమైనట్లేనా ?

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ జరిగింది అనే వార్త సంచలనం అయింది. అందరూ కొండకు వెళ్లి తృణమోపణమో సమర్పించుకుంటారు. అది భక్తి.కానీ ఆయనకు సమర్పించుకున్న వాటినే దొంగిలిస్తున్నారన్న మాట అదీ కూడా ఆయన సమక్షంలో భక్తి పారవశ్యంతో మునిగపియేవారే ఈ చోరీ చేస్తున్నారన్న విషయం బయటకు రావడం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోంది. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? టీటీడీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది ?

దొరకకుండా ఎంత శ్రీవారి సొమ్మును తీసుకెళ్తున్నారో ?

దొరికిన వారే దొంగలు. శ్రీవారి పరకామణి నుంచి సొమ్మును తీసుకెళ్తున్న వారిని సీసీ కెమెరాల్లో చూసి పట్టుకున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆయన పెద్ద జీయర్ల స్వామి ఆశ్రమంలో ఉండే గుమస్తా. పరకామణిలో పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారని ఆయన ఇలా దుర్వినియోగం చేశారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై కేసు పెట్టి ఉంటారు. పట్టుకున్నారు సరే.. మరి పట్టుకోకపోతే…? ఇంతకు ముందుఇలా ఎన్ని సార్లు ఇలా తీసుకెళ్లాడో ఎవరైనా అంచనా వేయగలరా ?. దొరికినప్పుడే దొంగ… అంతకు ముందు ఎంత దోచుకెళ్లాడో ఎవరికీ తెలియదు. పైగా ఇదే మొదటి సారి కాదు .. గతంలోనూ పరకామణి చోరీల గురించి స్పష్టత వచ్చింది. కానీ టీటీడీ ఎప్పటికప్పుడు పట్టుకున్నామని కాలర్ ఎగరేస్తోంది. కానీ ఇక్కడ అసలు విషయం గుర్తించడం లేదు. ఎందుకిలా జరుగుతోంది ?

డాలర్లే ఎందుకు తీసుకెళ్తున్నాడు ? వెనుక ఎవరూ ఉండరా ?

పరకామణి నుంచి చోరీ చేస్తున్న వ్యక్తి డాలర్లు మాత్రమే తీసుకెళ్తున్నాడు. ఇది మరింత అనుమానాస్పదంగా ఉంది. అసలు ఆయన డాలర్లు మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నాడనేది పెద్ద మిస్టరీ. డాలర్లు మార్చుకోవాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయో చూపించాల్సి ఉంటుంది. వీటిని ఎలా మారుస్తారన్నది ఇప్పుడు టీటీడీ అధికారులు తేల్చాల్సి ఉంది. అయితే పట్టుబడిన వ్యక్తి ఒక్కరే ఇలా చేయరని..ఆయన వెనుక ఎవరైనా ఉండి ఉండి ఉండవచ్చన్న అనుమానాలు కూడా బలంగా కలుగుతున్నాయి. దీన్ని టీటీడీ నివృతి చేయాల్సి ఉంది.

దొంగల్ని పట్టుకోవడం కాదు.. దొంగతనం జరగకుండా చూడాలి !

రూ. 15 కోట్లు పెట్టి సీసీ కెమెరాల్ని పెట్టామని టీటీడీ ఘనంగా చెబుతోంది. కానీ నిఘా ఇతర ప్రాంతాల్లో వేరు… టీటీడీలో వేరు. దొంగతనం చేసిన తర్వాత పట్టుకోవడం కాదు.. దొంగతనం జరగకుండా చూడాలి. ఎందుకంటే.. అది శ్రీవారి ఆలయ ప్రాంగణం. శ్రీవారి సొమ్మును దొంగతనం చేయాలనుకునే ఓ ఆలోచన ఎవరికైనా వచ్చింది అంటే… అలాంటి వారు కొండపై ఉండకూడదనేలా మార్పు తీసుకు రావాలి. దొంగల్ని పట్టుకున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు..అలాంటి చాన్స్ ఇచ్చినందుకు… అలాంటి వారిని అక్కడి వరకూ రానిచ్చినందుకు టీటీడీ సిగ్గుపడాలి. ఇది భక్తుల నమ్మకంతో ముడిపడిన అంశం.

భక్తుల మనోభావాలు పట్టవా ?

టీటీడీ పరకామణిలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడటం లేదు. శ్రీవారి భక్తులు వేసి కానుకుల్ని కాళ్లతో తొక్కుకున్న దశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. శ్రీవారి కానుకులు అంటే భక్తులు ఎంతో భక్తితో ముడుపు కట్టి హుండీలో వేస్తారు. వాటిని అంతే గౌరవంగా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. కానీ టీటీడీ తీరు ఇతర విషయాల్లోలాగే .. ఇందులోనూ నాసిరకంగ ఉంది. వెంటనే కళ్లు తెరిచి.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది.