గ్రామ పంచాయతీల నిధుల్ని ఏపీ ప్రభుత్వం పూర్తిగా స్వాహా చేస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు వేల కోట్లను … పంచాయతీ ఖాతాల నుంచి కొల్లగొడుతున్నారు. దీనిపై సర్పంచ్ లు మండిపడుతున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేయడమే కాదు… ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన పలువురు సర్పంచ్‌లు తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. వైసీపీ సర్కార్ తీరు చూస్తే.. పంచాయతీల్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో పోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది.
వేల కోట్లు దారి మళ్లిస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వాటికి అందడం లేదు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు 2019-20 సంవత్సరానికి రూ.2118 కోట్లు, 2020-21 సంవత్సరానికి రూ.1837 కోట్లు, 2021-22 సంవత్సరానికి రూ.1917 కోట్లు- విడుదలయ్యాయి. ఆ నిధులన్నింటినీ ప్రభుత్వం వాడేసుకోవడం వల్ల పంచాయతీలు కేంద్రం దృష్టిలో బ్లాకులిస్టులో పడాల్సి వచ్చింది. పంచాయతీ తీర్మానం లేకుండా సర్పంచుల సంతకం లేకుండా నిధులు వెనక్కు తీసుకోవడం సరికాదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పంచాయతీలకు కాకుండా సచివాలాయలకు ప్రభుత్వం నిధులు
ఇటీవల వైసీపీ ప్రభుత్వం గడప గడపకూ ప్రజాప్రతినిధుల్ని పంపినప్పుడు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవడంతో గ్రామ సచివాలయానికి రూ. ఇరవై లక్షల చొప్పున మంజూరు చేసినట్లుగా ప్రకటించారు. ఇచ్చారో లేదో ఎవరికీ తెలియదు కానీ.. ఆ ప్రకటన చేశారు. అసలు గ్రామ సచివాలయాలకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పడిప్పుడే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయన్న ఆందోళన గ్రామాల్లో కనిపించింది. పంచాయతీరాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని అనేక మంది ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటించిం. కానీ పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నలు సహజంగానే వచ్చాయి.
వ్యూహాత్మకంగా గ్రామ పాలనా వ్యవస్థ నిర్వీర్యం
సర్పంచ్ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం కూడా వివాదాస్పదమయింది. సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం. దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. మొత్తంగా ఈ ప్రభుత్వం గ్రామ స్వపరిపాలనను కలలుగన్న మహాత్ముడి ఆశయాలను.. పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఓ వైపు ఆర్థిక సంఘం నిధులను స్వాహం చేయడం.. మరో వైపు పంచాయతీ అధికారాలకు కత్తెర వేయడంతో వాటిని ఎందుకూ పనికిరాకుండా చేసింది. ఇప్పుడు సచివాలయాలు, వాలంటీర్లను ప్రయోగించి.. పాలన చేస్తూ… ఇక పంచాయతీల అవసరం లేనట్లుగా వ్యవహరిస్తోంది.
ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కావడంతో పోరాటానికి ఏపీ బీజేపీ రెడీ అయింది. ఈ అంశంపై త్వరలో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.