వైసీపీ ప్రభుత్వం రైతులకు సాయం చేయదు సరే కనీసం పరామర్శ కూడా ఉండదా !?

ఎండా కాలం వానలు తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని నిండా ముంచేశాయి. ఆరబెట్టుకున్న ధాన్యం నీళ్ల పాలయింది. కోతకు పంట నాశనం అయింది. ఎలా చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సాయం చేస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే రాజకీయ నేతలు చాలా మంది రైతుల్ని పరామర్శిస్తున్నారు. భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ఈ పని ముందుగా చేయాలి. ఎందుకంటే వారికి బాధ్యత ఉంటుంది. కానీ ఏపీలో వైసీపీ ఏం చేస్తోంది ?. ఏమీ చేయడం లేదు. ఒక్క నేత కూడా పొలంలోిక వెళ్లలేదు. వ్యవసాయ మంత్రి నియోజకవర్గంలో కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్నారు.

విపత్తుల్లో అసలు బయట కనిపించని ప్రభుత్వం

ఎన్ని విపత్తులు వచ్చిన రైతుల వైపు కూడా చూడటానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు. తమ పరిధిలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, నేతలకుకూడా చెప్పలేదు. సీఎం అసలు ఎప్పుడూ వెళ్లరు. ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా గాలికొదిలేసింది. అంతే కాదు ఇంత వరకూ పైసా కూడా సాయం ప్రకటించలేదు. ఇప్పుడు తాము రైతుల వద్దకు వెళ్తే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఎక్కువ మంది వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. సీఎం అయిన తర్వాత ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. తాను వెళ్తే అధికారుల పనుల అడ్డంకి అనే కారణం చెప్పి అడుగు బయట పెట్టడం లేదు. ముఖ్యమంత్రి వస్తే ఇంకా సీరియస్ గా రైతుల్ని ఆదుకుంటారు కానీ..అసలు ఆయన రాకపోతే ఇక పర్యవేక్షణ ఎలా ఉంటుందనే సంగతిని ఆయన మర్చిపోయారు. రైతుల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేయడం.. ఎలాంటి సాయం ఇవ్వకపోతూండటంతో రైతుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని .. ఎమ్మెల్యేల మీద చూపించుకోవచ్చన్నట్లుగా వారిని వెళ్లాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారు.

రైతుల్ని పూర్తిగా గాలికి వదిలేసి నప్రభుత్వం !

ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అండగా ఉంటే ఉండే ధైర్యం వేరు. అందుకే ఏదైనా విపత్తు జరగగానే తామున్నామంటూ ప్రభుత్వానికి చెందిన వారు వెళ్తారు. తమది రైతు ప్రభుత్వమని ఖచ్చితంగా ఆదుకుంటామని..తడిచిన ధాన్యాన్ని కొంటామని భరోసా ఇచ్చేవారే లేకుండా పోయారు. ఏపీలో మాత్రం ఏ ఒక్క మంత్రి రైతుల్ని పరామర్శించేందుకు ఆసక్తి చూపించడం లేదు. పంట తడిచిపోయినందని ఓ రైతు బాధ చెప్పుకుంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బూతులు తిట్టి పంపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే రైతులు సంతోషంగా ఉన్నారనే ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. చేతికి వచ్చిన పంట పాడైపోయింది. చేతికి రావాల్సిన పంట వస్తుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి దైర్యం చెప్పడానికి కూడా ఎవరూ రాలేదు. అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన అధికారులు .. సాయం చేయలేమని కావాలంటే సలహాలిస్తామని ప్రకటించడం వివాదాస్పదమయింది.

విపత్తు నిధులూ దారి మళ్లించేసి చోద్యం చూస్తున్నారా?

ఇలాంటి సమయంలో ప్రకృతి విపత్తులకు ప్రజలకు సాయం చేయడానికి ఆర్థిక సమస్యలు ఉండటం వల్లనే చురుకుగా కదలడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే.. వేల మంది రైతులు నష్టాన్ని తప్పించుకునేవారనే వాదన ఉంది. ప్రభుత్వం ఆర్థికం కాకపోయినా.. సమయానుకూలంగా చురుకుగా వ్యవహరిస్తే.. ఎంతో నష్టం తగ్గి ఉండేదని రైతులు అంటున్నారు. ఇది రైతుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణం అవుతోంది. అటు మంత్రులు.. అటు యంత్రాంగం మొత్తం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టంపై యాంత్రికంగా వ్యవహరించడంతో రైతులకష్టాలు మరింత పెరుగుతున్నాయి.