విపక్షాలపై ఉప రాష్ట్రపతి ఆగ్రహం

పార్లమెంటులో గందరగోళం సృష్టించడం ఓ రివాజుగా మారింది. వెల్ లోకి దూసుకెళ్లి కార్యక్రమాలను అడ్డుకునేందుకే విపక్షాలు సభలోకి వస్తున్నాయి. నినాదాలిస్తూ ఛైర్మెన్ విధులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉభయ సభలు ఇలా మొదలై అలా వాయిదా పడుతుంది. వాయిదాల పర్వంతోనే సభ సాగిపోతోంది. రోజూ ఏదోక అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం, సభాధ్యక్షుడు దాన్ని తోసిపుచ్చడంతో గోల చేయడం జరుగుతోంది. అర్థవంతమైన చర్చలకు అవకాశం లేకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చర్చించేందుకు అవకాశమిస్తామని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ పదే పదే హామీ ఇచ్చినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోకుండా డిస్ట్రబెన్స్ సృష్టిస్తూనే ఉన్నారు. దేశ ప్రజలు టీవీల్లో చూస్తున్నారని గానీ, ప్రజాధనం వృథా అవుతోందని గానీ వాళ్లకు అనిపించడం లేదు. నవ్విపోదురుగాక నాకేంటీ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు…

అడ్డుకోవడమే ఆయుధంగా మారిన వేళ…

భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అయిన జగ్దీప్ ధన్కక్ విపక్షాలపై ఒక రేంజ్ లో విచురుకుపడ్డారు. ప్రతీసారీ పార్లమెంట్ సమావేశాలు వాషవుట్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్నే ఆయుధంగా మలుచుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంశాల వారీగా వ్యతిరేకించడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రజాసామ్య ప్రక్రియలో భాగమైనప్పటికీ అటువంటి అవకాశాలను సభా కార్యక్రమాల స్థంబింపజేసేందుకు వాడుకోవడమనేది ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతోందని ఆయన గుర్తు చేశారు. ఒక సభలో మాట్లాడుతూ విపక్షాల తీరును ఎండగట్టారు. సంప్రదింపులు, చర్చలు, అభిప్రాయ సేకరణ లాంటివి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా నిలుస్తాయని అంటూ.. అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం మాత్రం ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతిబంధకంగా మారతాయన్నారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అదే పనిలో ఉన్నాయన్నారు.

ప్రజలే బాధితులవుతున్నారు..

పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవడం వల్ల ప్రజాసంక్షేమం దెబ్బతింటోందని, అంతిమంగా ప్రజలే బాధితులవుతున్నారని థన్కడ్ గుర్తు చేశారు. ప్రతీ రోజు ప్రశ్నోత్తరాల సమయం జరగకపోవడంతో ప్రజా సమస్యలు చర్చకు రాని దుస్థితి దాపురిస్తోందన్నారు. పారదర్శక పాలన అందించాలన్న, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల దృష్టికి వెళ్లాలన్నా పార్లమెంటు సజావుగా సాగాలన్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించి, పదవులు అనుభవించిన వారే ఇప్పుడు పార్లమెంటును అడ్డుకునేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా వాళ్లు తమ వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు.

మోదీ ప్రభుత్వానికి ప్రశంసలు

దేశ సర్వతోముఖ ప్రగతిలో మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వ చొరవను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానాంశాలుగా పాలన సాగుతోందన్నారు. అవినీతిపరులు, మధ్యవర్తులు, అధికార దళారీలకు అవకాశం లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. అందుకే అవినీతిపరులు అల్లాడిపోతూ ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి వారిని సమాజం దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో ప్రతీ ఒక్క పౌరుడి చేయూత అవసరమన్నారు.