నిట్ట నిలువునా చీలిన యూపీ విపక్షం

ఉత్తర ప్రదేశ్ బీజేపీకి కంచుకోట. డబుల్ ఇంజిన్ సర్కారుతో అతి పెద్ద రాష్ట్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్రం. బాగా వెనుకబడిన రాష్ట్రం నుంచి అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కూడా దూసుకుపోతున్న రాష్ట్రం కూడా అదే. రాజకీయ వైరుధ్యాలు, పదవుల కోసం సిగపట్లు కూడా అక్కడ ఎక్కువే. ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ నుంచే ప్రధానమంత్రులుండేవారు. ఇప్పుడు మాత్రం ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ నెంబర్ వన్. మిగతా పార్టీలన్నీ నెంబర్ టెన్ నుంచి మొదలవుతాయి.ఐదేళ్లు అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సైతం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. అలాగని విపక్షాల ఐక్యతకు చేయూతనిస్తుందా అంటే అదీ లేదు.

సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరు కాని అఖిలేశ్

అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి. తండ్రి ములాయం మరణానంతరం ఇప్పుడు ఎస్పీకి ఆయనే అన్ని తానై నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో సారి ఓడిపోయిన తర్వాత మాత్రం ఆయన పార్టీ ఇప్పుడు డీలా పడిపోయింది.అందరం కలిసి మోదీపై పోరాడదామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ లాంటి నేతలు పిలుపునిస్తే అఖిలేష్ కాసేపు అవునంటారు.. మరికాసేపు కాదంటారు. అందరితో కలిసినట్లే ఉంటారు. చివరకు కలవకుండా వదిలేస్తారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న వారిలో అఖిలేష్ కూడా ఉన్నారు. అయితే ముందే గోరఖ్ పూర్లో రెండు కార్యక్రమాలున్నాయి రాలేకపోతున్నానని సందేశం పంపారు. తీరా చూస్తే ఆయన గోరఖ్ పూర్ వెళ్లలేదు. మేనత్తకు ఒంట్లో బాగేలేదని సైఫై వెళ్లారు. దానితో కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరు కావడం అఖిలేఖ్ కు ఇష్టం లేదని అర్థమైంది.

హాజరైన జయంత్ చౌదరి

ఎస్పీకి పొత్తు భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి మాత్రం సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కాంగ్రెస్ తో పొత్తుకు తాము సుముఖమే అన్నట్లుగా ఆయన సందేశమిచ్చారు. కాకపోతే ఆయనది చిన్న పార్టీ.పటమటి ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని ఆయన ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ కు అఖిలేష్ దూరం

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన ఎస్పీ నేత అఖిలేష్ చేతులు కాల్చుకున్నారు. అప్పటినుంచి కాంగ్రెస్ పట్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడింది. అందుకే మమత వచ్చి మాట్లాడినా, నితీశ్ రాయబారం చేసినా తప్పని పరిస్థితుల్లో కాసేపు అవునని, తర్వాత అంత సీన్ లేదని అఖిలేష్ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.సోనియా, రాహుల్ తీరు అఖిలేష్ కు అసలు నచ్చడం లేదట. అందుకే అమేఠీ, రాయ్ బేరేలీలో కూడా పోటీ పెట్టాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి….