ఏపీలో ఆ మాజీ డిప్యూటీ సీఎంకూ టిక్కెట్ కష్టమే – ఏలూరు నాని సైలెంట్ అయ్యారేంటి ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారు. మొదటి సారి కూడా ఇచ్చారు. అలా డిప్యూటీ సీఎం అయిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తర్వాత పదవి పోగొట్టుకున్నారు. కాస్త నెమ్మదస్తుడు కావడంతో రాజకీయంగా వైసీపీ దూకుడును అందుకోలేకపోయారు. అదే ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారింందని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఆళ్ల నానికి వర్గ పోరు

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని.. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ.. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలతో.. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు.. టికెట్ రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకనుగుణంగా వాళ్లు పావులు కదుపుతున్నారు. ఏలూరులో ఆళ్ల నాని వర్సెస్ పెదబాబు అన్నట్లుగా వర్గ పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే నానిని ఏలూరు పార్లమెంట్ బరిలో దించే ఆలోచనలో అధిష్టానం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే.. ఆళ్ల నాని మాత్రం.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు.

రాజకీయంగా చైతన్యవంతులయిన ఓటర్లు

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్.. తర్వాత కాంగ్రెస్‌కు అడ్డాగా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. ఏలూరులో టీడీపీ గెలుస్తూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని.. ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని.. స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత రెండు దశాబ్దాలుగా ఏలూరులో ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్యే రాజకీయం నడుస్తోంది. బడేటి బుజ్జి చనిపోవడంతో ఆయన సోదరుడికి ఇంచార్జ్ ఇచ్చారు. నియోజకవర్గంలో కాపు, తూర్పు కాపు, వైశ్య సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఎవరు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతలే.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు.

పొత్తులో జనసేన తీసుకుంటుందా ?

బడేటి బుజ్జి మరణంతో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న బడేటి చంటి విస్తృతంగా పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఆళ్ల నాని.. ఏలూరులో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై క్లారిటీ లేదు. జనసేనతో గనక పొత్తు కుదిరితే.. ఏలూరు బరిలో టీడీపీ ఉంటుందా? జనసేనకు అవకాశం ఇస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఏలూరు జిల్లాలో జనసేనకు ఎంతో కొంత పట్టున్న సెగ్మెంట్.. ఏలూరు మాత్రమే. టీడీపీతో పొత్తు కుదిరితే.. జనసేన అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు పవన్ కల్యాణ్‌కు బంధువు కావడంతో.. ఆయన్నే పోటీలో ఉంచుతారనే టాక్ వినిపిస్తోంది.