మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన మామన్నన్ తెలుగులో నాయకుడు పేరుతో జూలై 14న విడుదలైంది. ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదట్నుంచీ ఉన్న అంచనాలేవీ తగ్గకుండా ఉంది మూవీ. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ నటించిన ‘మామన్నన్’ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్టైంది. అదే సినిమాను తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల చేసారు. ఈ మూవీలో వడివేలు నటనకు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందాన్ని కొత్తగా చూసినట్టే నాయకుడు సినిమాలో కొత్త వడివేలు కనిపించాడు. మిగిలిన నటులంతా తమ పాత్రలకు న్యాయం చేస్తే వడివేలు మాత్రం తన క్యారెక్టర్ కు ప్రాణం పోశాడు. ఇప్పటివరకూ కమెడియన్ లా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన వడివేలు సిన్సియర్ పొలిటీషియన్ , బాధ్యతగల తండ్రిగా అద్భుతంగా నటించాడు. ఇంకా చెప్పాలంటే ‘రంగమార్తాండ’ సినిమా చూసిన తర్వాత బ్రహ్మానందాన్ని చూసి కలిగే ఫీలింగ్ ఇందులో వడివేలుని చూశాక సేమ్ అనిపిస్తుంది. ఇంత మంచి నటుడ్ని ఇన్నాళ్లూ కామెడీకే పరిమితం చేశారా అనుకున్నారంతా.
రఘువీరాగా నటించిన ఉదయనిధి స్టాలిన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. తండ్రి తిమ్మరాజుగా నటించిన వడివేలు రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీలగా నటించిన కీర్తి..రఘువీరా క్లాస్ మేట్. అప్పట్లోనే ఇద్దరి మధ్యా ప్రేమ ఉన్నా బయటకు వ్యక్తం చేసుకోరు. చదువు పూర్తయ్యాక లీల పేదలకు ఉచితంగా చదువు చెప్పేందుకు ఓ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. దానికి అడుగడుకునా అడ్డంకులు ఎదరవడంతో బిల్డింగ్ కోసం వడివేలును కలిస్తే ఉదయనిధి తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు. ఓ రోజు ఆ బిల్డింగ్ పై కొందరు రౌడీలు దాడి చేసి ధ్వంసం చేసేస్తారు. వడివేలు పార్టీకి చెందిన ఫహాద్ ఫాజిల్ అన్న సునీల్ రెడ్డే అదంతా చేయించాడని తెలుస్తుంది. గొడవ ముదరడంతో దాన్ని తీర్చేందుకు రంగంలోకి దిగుతాడు రత్నవేల్ గా నటించిన ఫహాద్ ఫాజిల్. ఆ తర్వాత ఏం అయింది? ఓ బిల్డింగ్ ధ్వంసం విషయం కులాల గొడవలా ఎలా మారిందన్నదే కథ. ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ జోరుగా సాగుతుంది. సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది..అక్కడ మిస్సైనవారంతా ఓటీటీలో మాత్రం మిస్సవకండి.