మోదీని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఒకటయ్యేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలు వరుసగా రెండు సార్లు భేటీ అయ్యాయి. తొలుత పట్నా, రెండో సారి బెంగళూరు తర్వాత త్వరలో ముంబై సమావేశం కూడా ఉంటుందని చెప్పుకున్నాయి. ప్రజలు ఎదురొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.
గేమ్ ఛేంజర్ అంటున్న కాంగ్రెస్
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.. విపక్షాల మీటింగ్ గేమ్ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆట మారుతుందని, రాజకీయ క్రీడలో తమదే విజయమని వివరించారు. తమకు అధికార దాహం లేదని ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే ధ్యేయమని చెప్పుకున్నారు. దేశంలో వేర్వేరు వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటం, ప్రజల రాజ్యాంగ హక్కులకు భంగం కలుగకుండా చూసుకోవడం లాంటి హామీల ప్రాతిపదికగా బెంగళూరు కాంక్లేవ్ జరిగిందని నేతల మాటలను బట్టి, వినిపిస్తున్న విశ్లేషణలను బట్టి అర్థమవుతోంది. సోమవారం రాత్రి బెంగళూరులో సిద్దరామయ్య ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఇష్టాగోష్ఠిగా చర్చలు జరిపిన ప్రతిపక్షాల అగ్ర నేతలు.. బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తమ పోరాటానికి ఓ రూపం తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. విపక్షాల తదుపరి భేటీ ముంబైలో జరుగుతుందని చెప్పారు.
పేరులోనే అసలు తంటా – నితీశ్ కుమార్ అలిగారంటా..
కొత్త కూటమి పేరు కూడా విచిత్రంగా ఉంది. దాని పేరు ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవల్పమెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ అని చదువుకోవాలి. తెలుగులో చెప్పాలంటే అదీ భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమిగా భావించాలి. మీటింగుకు వచ్చిన 26 పార్టీలు కలిసి కూటమికి ఇండియా అని పేరు పెట్టినట్లే కనిపించినా కొందరికి మాత్రం అభ్యంతరాలున్నట్లు గంటల వ్యవధిలోనే తెలిపోయింది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కలిసి ఫైనలైజ్ చేసిన పేరును బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. పేరును ప్రస్తావిస్తున్నప్పుడే నితీశ్ అభ్యంతరం చెప్పారని, ఇదేమీ అర్థం పర్థం లేని పేరు అని నిలదీశారని విశ్వసనీయ సమాచారం. ఇండియాకు వాళ్లిచ్చిన నిర్వచనంపై కూడా నితీశ్ సంతృప్తి చెందలేదని సమావేశంలో ఉన్న వారు చెబుతున్నారు.
మధ్యలోనే వెళ్లిపోయిన నితీశ్
కూటమి భాగస్వాముల తీరుపై అలిగిన నితీశ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయడం మినహా కీలకాంశాలు చర్చించలేదని నితీశ్ ఆగ్రహం చెందారట. వాటిని మరోసారి జరిగే ముంబై సదస్సు వరకు వాయిదా వేయాల్సిన అవసరం ఏముందని కూడా నితీశ్ నిలదీశారట. సమాధానం రాకపోవడంతో కూటమి నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు కూడా హాజరు కాకుండా ఆయన పట్నా ప్రయాణమయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో.. ముందే నిర్ణయించుకున్న షెడ్యుల్ ప్రకారం నితీశ్ వెళ్లిపోయారని చెబుతూ కూటమి పెద్దలు తప్పించుకునే పనిలో ఉన్నారు.