కకాలంలో రెండు కీలక సమావేశాలు దేశ రాజకీయాలను కుదిపేసే అవకాశాలున్నాయి. విపక్షాల బెంగళూరు భేటీ, ఎన్డీయే ఢిల్లీ సమావేశంతో 2024 ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. విపక్షాల కంటే మోదీ నేతృత్వం ఎన్డీయేనే మెగా సెషన్ కు రెడీ అవుతోంది. విశాల జనహితం కోసం కొత్త పార్టీలను సైతం కూటమిలో కలుపుకునేందుకు బీజేపీ సిద్ధమై ఆ దిశగా అడుగులు వేసింది.
మీటింగుకు 30 పార్టీల పైగా…
బుధవారం జరిగే ఎన్డీయే పక్షాల భేటీకి 30 పార్టీల పైగా హాజరవుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయం అంచనా వేస్తోంది. రోజుకు రెండు పార్టీలు వచ్చి ఎన్డీయేలో చేరడమే ఇందుకు కారణమవుతోంది. తాజాగా ఓం ప్రకాష్ రాజ్ బహర్ నేతృత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) వచ్చి ఎన్డీయే లో చేరుతున్నట్లు ప్రకటించింది. ఇదీ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కు చావుదెబ్బగా భావిస్తున్నారు. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎస్బీఎస్పీకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉండటంతో ఆ పార్టీ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంది.
త్వరలో జేడీఎస్ ఎంట్రీ
బీజేపీ పరాజయం పాలైన కర్ణాటకలో కూడా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ స్థాపించి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్వహిస్తున్న జేడీఎస్ త్వరలో ఎన్డీయే కూటమికి చేరే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు 20 స్థానాల లోపే రావడంతో పాటు ఓల్డ్ మైసూరు ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు మారడంతో కుమారస్వామి కొత్త రూటు వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా ఉంటే మొత్తం కోల్పోయే ప్రమాదం ఉందన్న అనుమానాల నడుమ ఎన్డీయేలోకి రావాలని కుమారస్వామి భావిస్తున్నారు.
మోదీ పాజిటివ్ .. దిక్కుతోచని విపక్షం
ప్రధాని నరేంద్ర మోదీ పాజిటివ్ దృక్పధంతో ఎన్డీయేను విస్తరించే పనిలో ఉన్నారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి చర్యలే ప్రధాన అజెండాగా ముందుకు సాగే మోదీ.. దేశంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడకుండా చూసుకుంటున్నారు. 2000 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఓటమి అన్నది తెలియదు. ఇకపై కూడా జాతీయ స్థాయిలో ఎన్డీయేకు తిరుగులేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక యూపీఏలో ఐక్యత కొరవడింది. అసలు బెంగళూరు సభ జరుగుతుందా, అందులో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొంటుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఢిల్లీ ఆప్ సర్కారును ఇరకాటంలో పెట్టిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ చాలా కాలం ముందుకు రాలేదు. బెంగళూరు సదస్సు ఫెయిలవుతుందని భయపడిన బెంగాల్ సీఎం మమతా దీదీ స్వయంగా రంగ ప్రవేశం చేసి రాజీ పెట్టడంతో అయిష్టంగానే ఆర్డినెన్స్ ను సమర్థించేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. ఈ స్నేహం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే విపక్షాల్లో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులే. ఎన్డీయేలో మోదీ ఒక్కరే ఆ పదవిలో ఉంటారు.