తప్పు తెలిసొచ్చింది – ఇక ఎన్డీయేలోనే ఉంటానంటున్న నితీశ్

కొందరు తప్పులు చేస్తారు. మరికొందరు తప్పుల మీద తప్పులు చేస్తారు. కొందరికి వెంటనే తమ తప్పు తెలిసొస్తుంది. మరికొందరికి ఆలస్యంగా తెలిసొస్తుంది. ఏదోక టైమ్ లో తప్పు తెలుసుకున్న వ్యక్తి మళ్లీ ఆ తప్పు చేయకూడదనుకుంటారు. జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పరిస్థితి కూడా అదే.. తన తప్పు తెలుసుకున్నానని ఆయన అంటున్నారు..

ఢిల్లీ వచ్చిన బిహార్ సీఎం

నితీశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పలు అంశాలపై వ్యాఖ్యానించారు. అయితే పొత్తులపై ఆయన మాటలే పశ్చాత్తాపానికి నిదర్శనంగా నిలుస్తోంది. 1995 నుంచి ఎన్డీయేతో పొత్తులో ఉన్నామని గుర్తుచేసిన నితీశ్.. ఒకటి రెండు సార్లు అటు ఇటు వెళ్లిన మాట నిజమేనని ఒప్పుకున్నారు.ఇకపై అలా జరగదని పర్మినెంట్ గా ఎన్డీయేలోనే ఉంటానని ఆయన వెల్లడించారు. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ విలువ తనకు తెలిసొచ్చిందని ఆయన పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. బీజేపీతో కలిసుంటేనే తనకు, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని నితీశ్ విశ్వసిస్తున్నారు. తన అనుచరుల వద్ద కూడా నితీశ్ అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారట..

అమిత్ షా దిశానిర్దేశం చేయాలి..

నితీశ్ ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై తన ఆలోచనలు చెప్పడంతో పాటు వారి సలహాలు అడిగారు. జాతీయ రాజకీయాలతో పాటు బిహార్ రాజకీయాల విషయంలో ప్రతీ అంశంలోనూ బీజేపీని నేతలను కలుపుకుపోవడమే కాకుండా, వారి దిశానిర్దేశంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల విషయంపై తనకు ఎలాంటి డిమాండ్లు లేవని, బీజేపీతో చర్చించి వారు చెప్పినట్లుగానే నడుచుకుంటానని నితీశ్ అంటున్నారు.. గత లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల సంగతి కాసేపు పక్కన పెట్టి కొత్తగా వచ్చే భాగస్వాములను కూడా కలుపుకుపోయేందుకు తనకు అభ్యంతరం లేదని నితీశ్ చెప్పుకొస్తున్నారు..

అసెంబ్లీ రద్దుకే మొగ్గు

నితీశ్ మదిలో ఓ ఆలోచన మెదులుతోంది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీని పర్మినెంట్ గా దూరం పెట్టే ఆలోచన అది. బిహార్ అసెంబ్లీని రద్దు చేసి లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.ఈ మేరకు ఒక ప్రతిపాదన ఆయన అమిత్ షా, నడ్డా సమక్షంలో చేసినట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీతో సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని, అప్పుడు మరో ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి చీకుచింతా లేకుండా పాలించే అవకాశం ఉంటుందని నితీశ్ అంచనా వేసుకుంటున్నారు. దానికి ఇంకా బీజేపీ వైపు నుంచి సమాధానం రావాల్సి ఉంది. అమిత్ షా వద్ద చేసిన ప్రతిపాదన ఇంకా ప్రధాని మోదీకి చేరలేదని చెబుతున్నారు. ప్రధాని నిర్ణయాన్ని బట్టి బిహార్లో రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది….