బీజేపీ పొత్తులపై మీడియాకే ఎక్కువ టెన్షన్ – ఎప్పుడూ అవే కథలా !?

పెళ్లి కాని కుర్రాళ్లు కనిపిస్తే తెలిసిన వాళ్లు మొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అని …ఆ ప్రశ్న ఎదుర్కునే వారికి ఎంత కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఉద్యోగం వెదుక్కునే ప్రయత్నాల్లో ఉన్న వారికి ఏం చేస్తావనే ప్రశ్న కూడా ఇలాగే ఇరిటేషన్ తప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలకు మీడియా ప్రతినిధులు ఇలాంటి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలకు కోపం వచ్చేస్తోంది. కానీ తమాయించుకుంటున్నారు.

అన్ని పార్టీలతోనూ పొత్తులు కలిపేస్తున్న మీడియా

బీజేపీతో అన్ని పార్టీలకు మీడియా పొత్తులు కలిపేస్తోంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చినా పొత్తుల వ్యవహారంలో ఓ అడుగు ముందుకు పడిందని ప్రచారం చేసేస్తున్నారు . నిజానికి రాజకీయాలకు .. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం ఏమిటో మీడియాకే తెలియాలి. రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చినా ఏదో వంక పెట్టేస్తున్నారు . చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలను కలిసినా పొత్తులు అనేస్తున్నారు. కలిసి మాట్లాడిన వాళ్లు సైలెంట్ గా ఉన్నారు కానీ మీడియాకు హడావుడి ఎక్కువైంది.

జనసేనతో మాత్రమే పొత్తు అని క్లారిటీగా చెబుతున్న బీజేపీ

ఏపీ బీజేపీ నేతలు మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. తాము జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని… అది మాత్రమే నిజమని చెబుతున్నారు. ఆ పార్టీ కూడా అధికారికంగా తాము బీజేపీకి దూరమయ్యామని చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వేరే పార్టీలతో పొత్తు ప్రశ్న ఎందుకు వస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇతర పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే మీడియాలు మాత్రం.. బీజేపీని ఏదో ఓ పార్టీకి అంటగట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నాయి.

కేంద్ర పార్టీ ఆదేశాల మేరకే ఏదైనా !

పొత్తులు కానీ.. పార్టీ అంతర్గత విషయాలు కానీ పూర్తిగా … కేంద్ర పార్టీ ఆదేశాల మేరకే నిర్ణయాలు ఉంటాయని… ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. పొత్తుల విషయంలో రాష్ట్ర బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని అంటున్నారు. కానీ మీడియాతో ఏమైనా తేడాగా మాట్లాడితే వాటినే హైలెట్ చేసుకుని ఓ పార్టీకి బీజేపీ అనుబంధమని చెప్పేందుకు రెండువర్గాల మీడియాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రంలోనూ ఉండదని బీజేపీ వర్గాలు ఫైర్ అవుతున్నాయి.