125 బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ..

అన్నింటా ముందుండాలని ఎన్డీయేకు నాయకత్వం వహించే బీజేపీ అగ్రనేతలు సంకల్పించారు. దేశాన్ని అత్యాధునిక, నెంబర్ 3 ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దించేందుకు కృషి చేస్తున్న బీజేపీ పెద్దలు, లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోవాలనుకుంటున్నారు. బీజేపీకి సొంతంగా 370 స్థానాలు, ఎన్డీయేకి కనిష్టంగా 400 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని..ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు…

మోదీ నేతృత్వంలో మీటింగ్

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం పొద్దుపోయాక కీలక సమావేశం జరిగింది. అందులో అభ్యర్థుల జాబితాపై విస్తతంగా చర్చ జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగిన సమావేశంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చెందిన 550 మంది సభ్యులిచ్చిన లిస్టును పరిశీలించి, ఆశావహుల అవకాశాలను సమీక్షించారు. అంతకముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో ప్రధాని మోదీ విడిగా సమావేశమయ్యాయి. మోదీ జరిపిన విస్తృత స్థాయి సమావేశంలో సీనియర్ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రకాశ్ జవడేకర్, మన్సుఖ్ మాండవీయ, పుష్కర్ ధామి, ప్రమోద్ సావంత్, భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, కేశవ్ మౌర్యా, యోగి ఆదిత్యనాథ్ పాల్గొని తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించారు.

తొలుత పది రాష్ట్రాలపై దృష్టి

బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత తొలి దశలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఆ పది రాష్ట్రాల్లోని 125 నుంచి 150 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ అధిష్టానం సంకల్పించింది. సిట్టింగ్ అభ్యర్థులకు సంబంధించిన జేపీ నడ్డా దగ్గర ఇప్పటికే రిపోర్టులు ఉన్నట్లు, వారందరికీ విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత ప్రతీ నియోజకవర్గం నుంచి 12 మంది జాబితా సిద్ధం చేశారు. అందులో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నలుగురిని ఎంపిక చేసింది. అందులో చివరాఖరుగా ఒకరి పేరు ప్రకటించడం మోదీ నేతృత్వ ఉన్నత స్థాయి కమిటీ వంతు అవుతుంది..

తెలంగాణ కాస్త ముందు, ఏపీ కాస్త వెనుక..

రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో బీజేపీ విడిగా పోటీ చేస్తోంది. దానితో అక్కడ అభ్యర్థులను తొందరగానే ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభ్యర్థిత్వాలకు మోదీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆదిలాబాదా ఎంపీ సోయం బాపూరావు విషయంలో మాత్రం సందిగ్ధం నెలకొందని చెబుతున్నారు. ఏపీలో పొత్తులు ఖరారు కాకపోవడంతో అక్కడ అభ్యర్థులపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదు. అయితే నలుగురైదుగురు అభ్యర్థులపై కొంత మేర స్పష్టత వచ్చిందని కూడా చర్చించుకుంటున్నారు. అందులో హిందూపురం నుంచి విష్ణువర్థన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.అయితే వారం పది రోజుల్లో ఏపీ పొత్తులు తేలితే ఆ రాష్ట్ర నియోజకవర్గాల అభ్యర్థులను కూడా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది…