గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైనది. గంగాపుష్కరాలు జరుగుతున్న గంగానది పరీవాహక ప్రాంతాల్లో ప్రధమ స్థానం గంగోత్రిది. ఇక్కడ గంగానదిని భాగీరధి పేరుతో పిలుస్తారు. ఉత్తరకాశీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ఆలయం ఉంది. చార్ థామ్ యాత్ర సందర్భంగా గంగోత్రి ఆలయం తెరుచుకుంది. మరోవైపు గంగాపుష్కరాలు జరుగుతుండడంతో భక్తుల సందడి మరింత ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే వైశాఖ శుద్ధ సప్తమి అంటే ఏప్రిల్ 27న గంగాసప్తమి. గంగాదేవి అవతరించిన రోజు ఇది. భగీరథుడి తపస్సుకి మెచ్చి శివుడి ఝటాజూటం నుంచి నేలపైకి దూకిన రోజిది..
శ్రీమన్నారాయణుడి పాదాల వద్ద జన్మించిన గంగమ్మ..భగీరథుని తపస్సుకి మెచ్చి భువినుంచి దివికి దిగి హిమగిరిపై అడుగుపెట్టింది. అందుకే గంగాదేవి విష్ణుపుత్రి, ఈశ్వరపత్ని,భాగీరథి, దివి నుంచి దిగడం వల్ల సురనది అని పేరు. వాల్మీకి రామాయణంలో గంగావతరణం ఎంతో ఆసక్తికర గాథ.
గంగావతరణం
ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు… కేశిని, సుమతి. భృగుమహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవై వేల మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేథ యోగం సంకల్పిస్తాడు. అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడి భయం. చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి, కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. క్రతువు ఆగిపోతుంది అని సగరుడు కుమిలిపోతాడు. అరవై వేల మంది తనయులూ యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. అయితే ఆ యాగాశ్వాన్ని కపిల మహర్షి తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడనుకుని..మహర్షి మీద అభాండాలు వేస్తారు. ఆగ్రహించిన కపిల మహర్షి అరవైవేల మందినీ కంటిచూపుతో కాల్చేస్తాడు.
అసమంజుడి హయాంలో మొదలైన ప్రక్రియ
అసమంజుడు తన సోదరులను వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. గంగాదేవిని తీసుకొచ్చి ప్రవహింపజేస్తే సోదరులుబతుకుతారని భావించి తపస్సు మొదలుపెడతాడు. తపస్సు ఫలించదు. ఆ తర్వాత పినతండ్రుల జాడ వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు అసమంజుడి తనయుడు… తన తపస్సు కూడా ఫలించదు. ఆ తర్వాత తరం భగీరథుడు. భరీరథుడి కఠోర తపస్సుకు సంతసించి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు..కానీ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమాతకు లేదని చెబుతాడు.అప్పుడు పరమేశ్వరుడిని ప్రశన్నం చేసుకుంటాడు భగీథుడు. తన తలపై గంగ ప్రవాహాన్ని ధరించడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు..అలా దివి నుంచి శివుడి జటాఝూటంలోకి దూకిన గంగమ్మ అక్కడి నుంచి పాయలుగా మారి హిమాద్రిపై అడుగుపెట్టింది. ఆ రోడే వైశాఖ శుద్ధ సప్తమి…అందుకే ఈ రోజునిగంగా సప్తమి అంటారు. ఈ ఏడాది పుష్కరాలు కూడా రావడంతో ఏప్రిల్ 27 మరింత ప్రత్యేకం.
గంగోత్రి ఆలయం
గంగానది భూమిపై అడుగుపెట్టిన తర్వాత ఆ నది ఒడ్డున గంగామాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదట 18వ శతాబ్దంలో అమర్‌సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు. అది కొంత కాలానికి శిధిలమవ్వగా జైపూర్ సంస్థాన వంశస్థులు వెన్నలాంటి తెల్లచలువరాయితో పునర్నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యా హ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగా హారతి ఇస్తారు.
సహజ శిలా శివలింగం
గంగోత్రి ఆలయానికి సమీపంలో..నీటిలో మునిగిపోయిన సహజ శిలా శివలింగం ఉంది. చలికాలంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పుడు ఆ శివలింగాన్ని సులభంగా చూడవచ్చు. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం..గంగా దేవిని తన జటాఝూటంలో బంధించినప్పుడు శివుడు కూర్చున్న ప్రదేశం ఇది అని చెబుతారు.
జీవనవాహిని
హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. జీవితకాలంలో ఒక్కసారైనా గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండచి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం సేవిస్తే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుంచి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వెళతారు.