అడుగు ముందుకు పడని ఇండియా గ్రూపు

అంతన్నారు.. ఇంతన్నారు..చివరకు ఎంతన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదీ కాంగ్రెస్ సహా పలు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా గ్రూపు తీరు. చీలికలు పీలికలైన నానాజాతి సమితి మళ్లీ కలిసినట్లగా తయారైన ఇండియా గ్రూపు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక కూనారిల్లుతోంది. ఇంతవరకు సమగ్రంగా ఒక్క పని కూడా చేయలేకపోతోంది..

తొలి ర్యాలీ ఎప్పుడో..

గ్రూపు బలాన్ని నిరూపించుకునేందుకు ఏర్పాటు చేయదలచిన తొలి ర్యాలీ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. నాగ్ పూర్ నగరంలో ఈ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకుని చాలా రోజులైనా ఇంత వరకు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి . అక్టోబరు 20 నుంచి నవంబరు 10 మధ్య ఏదోక రోజున ర్యాలీ జరగాలని భావించినప్పటికీ దానిపై ఇంత స్పష్టత రాలేదని గ్రూపు నేతలు అంటున్నారు. నవంబరు 4న మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, పైగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుందని, పండుగ సీజన్ కూడా ఉందని, అందుకే ర్యాలీ నిర్వహించే తేదీపై నిర్ణయానికి రాలేకపోతున్నామని నేతలంటున్నారు. అయితే కాంగ్రెస్ తీరు నచ్చకే కొందరు నాగ్ పూర్ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని చెబుతున్నారు…నిజానికి అక్టోబరు మొదటి వారంలో భోపాల్ లో ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ దానికి అడ్డుచెప్పారు.

ఉత్తుత్తి సమన్వయ కమిటీలు…

సమన్వయ కమిటీ, వర్కింగ్ గ్రూపు అంటూ పెద్ద పెద్ద పేర్లతో కమిటీలు వేసినా అవి ముందుకు సాగడం లేదు. సెప్టెంబరు 13 తర్వాత సమన్వయ కమిటీ సమావేశమే జరగలేదు. సమన్వయ కమిటీలో చేరబోమని సీపీఎం ప్రకటించడం ఇండియా గ్రూపులో విభేదాలకు దర్పణం పడుతోంది. ప్రచార కమిటీ, సోషల్ మీడియా కమిటీ, రీసెర్చ్ గ్రూపు ఇంతవరకు ఒక్క సారి కూడా సమావేశం కాలేదు.

కాంగ్రెస్ తీరుపై తీవ్ర అభ్యంతరం

ఎన్నికల పోటీ, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాంగ్రెస్ తీరుపై ఇండియా గ్రూపు భాగస్వాములు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అంతకముందే పొత్తు ఉన్న బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర తప్పితే మిగతా చోట్ల చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోటీపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని భాగస్వామ్య పక్షాలు అంటున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తమకు సీట్లు కేటాయించనప్పుడు, తాము బలంగా ఉన్న ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ కు ఎందుకు సీట్లు వదులుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ తమకు తలా రెండు సీట్లు కేటాయించేందుకు సిద్ధపడనప్పుడు ఇతర రాష్ట్రాల్లో స్నేహం ఎందుకని సీపీఐ, సీపీఎం ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ తమ మద్దతు కోరుతోందని, రాష్ట్రాల్లో మాత్రం అధికారానికి పంచుకునేందుకు సిద్ధంగా లేదని మిత్రపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి…