గవర్నర్‌ను అవమానిస్తారు – రాష్ట్రపతికి కేంద్రం ఇచ్చే ప్రోటోకాల్ గురించి నీతులు చెబుతారా ?

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ విషయంలో ఎంత దారుణం.. అవమానకరంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేయాల్సి ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రసంగం లేకుండా చేయడానికి కూడా వెనుకాడని ప్రభుత్వం తెలంగాణలో ఉంది. ఇక గౌరవంగా ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయారు. అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కొత్తగా రాష్ట్రపతికి కేంద్రం ఇస్తున్న గౌరవ మర్యాదల గురించి ఆందోళన పట్టుకుంది. బీజేపీపై ఇదే సందు అని విమర్శలు చేస్తున్నారు.

సెక్రేటరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను కనీసం ఆహ్వానించని కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ సెక్రటేరియట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ప్రథమ పౌరురాలు గవర్నర్ ను ఆహ్వానించలేదు. కానీ ఆహ్వానించినా రాలేదని విమర్శలు చే్శారు. ఆహ్వానం పంపలేదని రాజ్ భవన్ గట్టిగా ఖండించిన తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే బీఆర్ఎస్ సర్కార్ మోదీపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రపతికి గౌరవం ఇవ్వడం లేదని. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపచేయడం లేదని అంటున్నారు. 2020లో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన ప్రధాని మోదీ.. ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే ఆ అధికారం మోదీకి ఎక్కడిదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కార్యనిర్వాహక అధికారం మాత్రమే ప్రధానికి ఉంటుందని.. శాసనవ్యవస్థపై పార్లమెంటుకు, న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారాలుంటాయిని లాజిక్ చెబుతోంది. మొత్తంగా ఈ మూడు వ్యవస్థలపై రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయని అంటున్నారు. మరి ఇదే సూత్రం రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌కు వర్తించదా ? ఎందుకు పట్టించుకోలేదు.?

పార్లమెంట్ భవనం వేరు.. పార్లమెంట్ కార్యకలాపాలు వేరు !

పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. శాసన వ్యవస్థ సహా ప్రతి వ్యవస్థపై అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అందుకే ప్రతీ వ్యవహారం దేశ స్థాయిలో రాష్ట్రపతి పేరు మీద..రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పేరు మీద నడుస్తూ ఉంటుంది. అలా అని ప్రతి అభివృద్ధి పనిని కూడా రాష్ట్రపతికి ముడి పెట్టడం .. ఆ పదవిని అగౌరవపర్చడమే. ఆ పదవికి ఓ స్థాయి ఉంటుంది. అయితే బీజేపీని విమర్శించాలనే లక్ష్యం.. మోదీని బద్నాం చేయాలన్న కోరికతో పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుందని లాజిక్ చెబుతున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపచేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే గవర్నర్ విషయంలో అసలు ప్రోటోకాల్ కూడా ఇవ్వని కేసీఆర్.. రాష్ట్రపతికి కేంద్రం ఇస్తున్న గౌరవ మర్యాదల గురించి మాట్లాడటం తేడాగా ఉందని ఎవరికైనా అనిపిస్తోంది.

రాష్ట్రపతికి ప్రపంచ దేశాల్లో అత్యున్నత గౌరవం !

భారత రాష్ట్రపతి సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ దేశాల్లో ఒకటి అయిన భారత్ కు అధిపతి. ఆ పదవిలో ఉన్న వారి స్థాయి బీఆర్ఎస్ నేతలు చెప్పేంత స్థాయిలో ఉండదు. భారత రాష్ట్రపతికి ప్రోటోకాల్ ప్రకారం లభించే గౌరవం అత్యున్నతంగా ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు ఉండవు.కానీ ఇలా విమర్శలు చేసే ముందు..తాము గవర్నర్ కు ఎలాంటి ప్రోటోకాల్ ఇస్తున్నామో బీఆర్ఎస్ వంటి పార్టీలు చూసుకోవాల్సి ఉంటుంది. తమకు నచ్చలేదని.. కేంద్రానికి నివేదికలు ఇస్తున్నారని ఇష్టారీతిన వేధింపులకు పాల్పడుతూ.. మరో వైపు ఇతరులు చిత్తశుద్ధితో చేస్తున్నదాన్ని విమర్శించడం రాజకీయంగా దివాలాకోరుతనమే.